ట్రంప్, మస్క్ లకు షాకులిచ్చిన న్యాయస్థానాలు.. జడ్జిల కీలక వ్యాఖ్యలు!
ఇక, ట్రంప్ తురుపుముక్క "డోజ్" నుంచి మస్క్ తీసుకొంటున్న నిర్ణయాలు అదే స్థాయిలో ఉంటున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 19 March 2025 5:30 PM ISTఅమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమవుతోన్నాయి. ఇక, ట్రంప్ తురుపుముక్క "డోజ్" నుంచి మస్క్ తీసుకొంటున్న నిర్ణయాలు అదే స్థాయిలో ఉంటున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఇద్దరికీ న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగిలాయి.
అవును... అటు ప్రెసిడెంట్ గా ట్రంప్, ఇడు డోజ్ సారథిగా ఎలాన్ మస్క్ లు తీసుకున్న రెండు నిర్ణయాలకు తాజాగా న్యాయస్థానంలో ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ సందర్భంగా రెండు సందర్భాల్లోనూ న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో.. రెండు కీలక నిర్ణయాలను ట్రంప్ సర్కార్ ఇప్పుడు వెనక్కి తీసుకోబోతోందని అంటున్నారు!
వివరాళ్లోకి వెళ్తే... రెండోసారి ప్రెసిడెంట్ అయిన అనంతరం మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్ జెండర్స్ పాల్గొనకుండా ట్రంప్ నిషేధించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేశారు! ఇదే సమయంలో.. ఆ దేశ మిలటరీ విభాగంలోనూ ట్రాన్స్ జెండర్స్ నియామకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. దీనిపై పలువురు ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు.
దీనిపై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన నాయమూర్తి అనారేస్... రాజ్యాంగంలోని ట్రాన్స్ జెండర్ ల హక్కులను ప్రెసిడెంట్ అడ్డుకోకూడదని.. ఆ అధికారం ఆయనకు ఉన్నప్పటికీ, అది సమంజసం కాదని తెలిపారు. సృష్టిలోని మానవులంతా సమానం అనే అమెరికా స్వాతంత్ర్య ప్రకటనను గుర్తు చేస్తూ.. ట్రంప్ ఆర్డర్లను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
ఎలాన్ మస్క్ కు ఎదురుదెబ్బ:!
ట్రంప్ 2.0లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన విభాగం... డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) అనే సంగతి తెలిసిందే. దీనికి తన సన్నిహితుడు, మిత్రుడు, శ్రేయోభిలాషి, ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ ను సారథిని చేశారు ట్రంప్. ఈ సమయంలో... యూఎస్ ఎయిడ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లను తొలగిస్తూ డోజ్ నిర్ణయం తీసుకుంది!
దీనిపై తాజాగా ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ క్రమంలో తాజాగా దీనిపై విచారణ జరగ్గా.. యూఎస్ ఎయిడ్ మూసివేతను వెంటనే నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తి థియోడర్ చువాంగ్... ఈ నిర్ణయం పలు విధాలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని తెలిపారు.