ట్రంప్ రూల్... టెన్షన్ లో అమెరికా డాక్టర్స్!
ఈ నేపథ్యంలో అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్ షిప్ పొందేందుకు ఆసక్తి చూపించే ప్రజల్లో, ఇప్పటికే ఆ మేరకు అన్నీ ప్లాన్ చేసుకున్న దంపతుల్లో భయాందోళనలు మొదలయ్యాయని అంటున్నారు.
By: Tupaki Desk | 23 Jan 2025 12:48 PM GMTఅమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ట్రంప్ పేల్చిన బాంబు... ‘జన్మతః పౌరసత్వ హక్కు రద్దు’కు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ. దీని ప్రకారం.. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్న, టూరిస్ట్, స్టూడెంట్, వర్క్ వీసా వంటి తాత్కాలిక వీసాలు కలిగి ఉన్న దంపతులకు పుట్టిన పిల్లలకు ఇకపై అమెరికా పౌరసత్వం దక్కదు.
దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ప్రధానంగా... హెచ్-1బీ వీసాలపై అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయ – అమెరికన్స్ లో ఈ విషయం తీవ్ర కలకలం రేపింది. ఈ నిర్ణయం ప్రకారం ఫిబ్రవరి 20 తర్వాత జన్మించే పిల్లలకు అమెరికా పాస్ పోర్ట్ రాదు.. వారు జన్మతః అమెరికా పౌరులుగా పరిగణించబడరు.
ఈ నేపథ్యంలో అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్ షిప్ పొందేందుకు ఆసక్తి చూపించే ప్రజల్లో, ఇప్పటికే ఆ మేరకు అన్నీ ప్లాన్ చేసుకున్న దంపతుల్లో భయాందోళనలు మొదలయ్యాయని అంటున్నారు. ఈ సమయంలో డెలివరీల కోసం పెద్ద ఎత్తున మహిళలు ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారని.. వీరిలో 8-9 నెలల మధ్య ఉన్న గర్భవతులు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.
అవును... అమెరికాలో నివసిస్తున్న అనేక విదేశీ కుటుంబాలకు బర్త్ రైట్ సిటిజన్ షిప్ అత్యంత కీలకమైన అంశం. వారి పిల్లలకు దీని ద్వారా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం వస్తుంది. అయితే... డొనాల్డ్ ట్రంప్ వచ్చీ రాగానే ఈ హక్కును రద్దు చేసే ఆర్డర్ ను తెరపైకి తెచ్చారు. ఇది ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వస్తుంది.
ఈ సమయంలో ఇప్పటికే గర్భవతులుగా ఉండి నెలలు నిండటం దగ్గరగా ఉన్న మహిళలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో చాలా మంది గర్భవతులైన మహిళలు.. ఫిబ్రవరి 20 లోపూ తమకు డెలివరీ అయ్యేలా చూడాలని.. సీ-సెక్షన్ పద్దతిలో డెలివరీ చేయమని వైద్యులను అభ్యర్థిస్తున్నారని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందిస్తున్న అమెరికాలోని గైనకాలజిస్టులు, ఇతర వైద్యులు... చాలా మంది మహిళలు ముందస్తుగా సీ-సెక్షన్ పద్ధతిలో డెలివరీ చేయమని డాక్టర్ లను అభ్యర్థిస్తున్నారని.. ఇందులో 8 నుంచి 9 నెలల గర్భంతో ఉన్నవారు ఉన్నరని.. వీరంతా ఫిబ్రవరి 20 కంటే ముందే తమకు డెలివరీ చేయాలని కోరుతున్నారని అంటున్నారు.
అయితే... తాము మాత్రం ఈ తరహా ఆలోచన అటు బిడ్డకు, ఇటు తల్లికి కూడా ప్రమాదమని హెచ్చరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఇలాంటి పనులు పిల్లల మానసిక, శారీరక పెరుగుదలపై ప్రభావం చూపుతాయని.. తల్లులకు కూడా జబ్బులు, ఇన్ ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నట్లు చెబుతున్నారని అంటున్నారు.
ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. నెలలు నిండకుండానే సీ-సెక్షన్ లో ఫిబ్రవరి 20 లోపు డెలివరీలు చేయాలంటూ గర్భవతులు అభ్యర్థిస్తుండటం అమెరికా వైద్యులను టెన్షన్ పెట్టడంతో పాటు వారికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నట్లు చెబుతున్నారు.