యూఎస్ లో ఇండియన్స్ కు కొత్త టెన్షన్... ఫిబ్రవరి 19 తర్వాత ఏమి జరగబోతుంది
ఈ సమయంలో అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఉన్న గర్భిణీలు గందరగోళంలో పడ్డారనే చర్చ తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 23 Jan 2025 7:56 AM GMTఅగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే డొనాల్డ్ ట్రంప్ తన కఠినమైన ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక ఎజెండాలో భాగంగా జన్మతః పౌరసత్వ హక్కుని రద్దు చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీ చేశారు. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ సమయంలో అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఉన్న గర్భిణీలు గందరగోళంలో పడ్డారనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... అమెరికాలో 14వ రాజ్యాంగ సవరణలో పొందుపరచబడిన బర్త్ రైట్ సిటిజన్ షిప్ ని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీ చేశారు. ఇందులో... అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్న వ్యక్తులకు జన్మించిన పిల్లలు యూఎస్ పౌరసర్వాన్ని పొందలేరు అని పేర్కొన్నారు. అయితే... అక్కడితో ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆపితే ఆ లెక్క వేరుగా ఉండేది. కానీ... ట్రంప్ అసలు ఉద్దేశ్యం అది మాత్రమే కాదేమో!
దీంతో... టూరిస్ట్, స్టూడెంట్, వర్క్ వీసా ద్వారా దేశంలోకి ప్రవేశించి లేదా ఉంటున్న తల్లితండ్రుల ఉనికి చట్టబద్దమైనదే కానీ తాత్కాలికమైనది. అందువల్ల వారికి జన్మించే పిల్లలకు జన్మతః పౌరసత్వ హక్కు ఇవ్వబడదు అని జతచేశారు. దీంతో.. అమెరికాలో ఉన్న ఎంతో మంది హెచ్-1బీ, హెచ్4ఎస్ వీసాలపై ఉన్నవారిని కూడా షాక్ కి గురి చేసింది. వీరిలో త్వరలో పిల్లలు పుట్టే దంపతుల పరిస్థితి సందిగ్ధంలో ఉందని అంటున్నారు.
వాషింగ్టన్ డీసీ ఆధారిత థింక్ ట్యాంక్ అయిన ఎకనామిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ ప్రకారం హెచ్-1బీ వీసాలపై అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్మారు 6,00,000 మంది వలస కార్మికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో... 2023లో యూఎస్ సిటిజన్ షిప్ & హోంల్యాండ్ సర్వీసెస్ ప్రకారం 72శాతం హెచ్-1బీ వీసాలు భారతీయులకు మంజూరు చేయబడ్డాయి!
మరోపక్క 2022 నుంచి ప్యూ సెంటర్ ఫర్ రీసెర్చ్ నివేదిక ప్రకారం సుమారు 7.25 లక్షల మందితో అమెరికాలో భారతీయులు మూడో అతిపెద్ద అనధికారిక వలస జనాభా ఉన్నారని చెబుతున్నారు. దీంతో... ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దు ఆర్డర్ వల్ల ఎంత మంది దంపతులు, తల్లితండ్రులు వారి వారికి జన్మించబోయే పిల్లల విషయంలో ఆందోళనలో ఉన్నారనేది స్పష్టమవుతుందని అంటున్నారు.
ఇది భారతీయ కమ్యూనిటీకి.. ప్రధానంగా రాబోయే నెల రోజుల్లో ప్రసవం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు గణనీయమైన ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. కారణం... డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను నెల రోజుల్లో అడ్డుకోని పక్షంలో ఆ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ఇది హెచ్-1బీ, హెచ్-4ఎస్ వీసాలపై ఉన్న ఎంతో మంది భారతీయుల జీవితాలను మలుపుతిప్పబోతోందని అంటున్నారు.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన న్యాయవాది ఒకరు... తల్లితండ్రులు ఇద్దరూ తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉంటే.. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం వారికి ఫిబ్రవరి 19 తర్వాత జన్మించిన బిడ్డకు యూఎస్ పాస్ పోర్ట్ జారీ చేయబడదు. ఇది అమెరికాతో ముడిపడిన చాలా మంది జీవితాలకు తీవ్ర అంతరాయం కలిగించే విషయం.. ఇది భారతీయ జంటలపై తక్షణమే ప్రభావం చూపిస్తుంది అని అన్నారు. ఈ సమయంలో వారి వీసాల గడువు ముగిసినప్పుడు వారు భారత్ కు తిరిగి వచ్చే పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు!