ట్రంప్ ఉరుములు... భారత్ లో రూ.10 లక్షల కోట్లు ఆవిరి!
తాజాగా కొలంబియాపై చూపించిన కోపం ఎఫెక్ట్ దేశీయ స్టాక్ మార్కెట్ పై పడటం గమనార్హం. ఈ సమయంలో.. సుమారు రూ.10 లక్షల కోట్లు ఆవిరైనట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 28 Jan 2025 4:05 AM GMTడొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం జారీ చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ప్రపంచాన్ని వణికించేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధనంగా వలసదారుల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు షాకింగ్ గా ఉంటున్నాయి. వీటికి అభ్యంతరం చెబితే.. చేసే వ్యాఖ్యలు అంతకు మించి అన్నట్లుగా ఉంటున్నాయి. అవి భారత్ పైనా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన రోజు ప్రెసిడెంట్ గా ఆయన చేసిన ప్రకటనలు భారత్ కు బిగ్ షాక్ కలిగించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సుంకాల విషయంలో ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన రోజు వ్యాఖ్యల ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఫలితంగా... రూ.7 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైన పరిస్థితి.
పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ తాజాగా ప్రకటించడం.. అప్పటికే భారత్ సహా పలు దేశాలపైనా సుంకాల విధింపు తప్పదని చేసిన వ్యాఖ్యలు వెరసి మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఈ క్రమంలో తాజాగా కొలంబియాపై చేసిన వ్యాఖ్యల ఫలితంగా మరోసారి దేశీయ స్టాక్ పై తీవ్ర ఎఫెక్ట్ చూపించాయి.
అవును... నాడు వైట్ హౌస్ లో లెగ్ పెట్టిన రోజు భారత్ స్టాక్ ఎక్స్చేంజ్ లో రూ.7 లక్షల కోట్లు ఆవిరైపోయినట్లు చెబుతోన్న నేపథ్యంలో.. తాజాగా కొలంబియాపై చూపించిన కోపం ఎఫెక్ట్ దేశీయ స్టాక్ మార్కెట్ పై పడటం గమనార్హం. ఈ సమయంలో.. సుమారు రూ.10 లక్షల కోట్లు ఆవిరైనట్లు చెబుతున్నారు.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 75,700.43 పాయింట్ల వద్ద నష్టల్లో ప్రారంభమవ్వగా.. అదే పరంపర రోజంతా కొనసాగింది. చివరకు 75,366 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ కూడా 263.05 పాయింట్లు కోల్పోయి 22,829.15 వద్ద ముగిసింది. అలాగే.. డాలర్ తో రూపాయి మారకం విలువ 11 పైసలు బలహీనపడి.. 86.33 వద్ద ముగిసింది.
ఫలితంగా.. ఇన్వెస్టర్స్ సంపదగా భావించే బీ.ఎస్.ఈ.లో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరై.. రూ.410 లక్షల కోట్లకు చేరింది. దీనికి ట్రంప్ కు కోపం తెప్పిస్తూ కొలంబియా నిర్ణయం తీసుకోగా.. తర్వాత అమెరికా ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలే కారణం అని అంటున్నారు.
ఇందులో భాగంగా... అమెరికాలోని అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి, నేరస్తులుగా ట్రీట్ చేస్తూ పంపుతున్నారంటూ కొలంబియా వ్యాఖ్యానించింది.. అమెరికా విమానాలను వెనక్కి పంపించింది. దీంతో... ట్రంప్ సీరియస్ అయ్యారు, ఆ దేశంపై సుంకాలు 25శాతం విధిస్తామని బెదిరించారు. దీంతో.. కొలంబియా తన నిర్ణయాన్ని మార్చుకుంది.
తన నిర్ణయాలను వ్యతిరేకించే దేశాలను దారిలోకి తెచ్చుకోవడం కోసం ట్రంప్ ఈ విధంగా బెదిరింపులకు దిగుతుండటంతో ఎప్పుడు, ఏ దేశంపై ట్రంప్ ఉరుముతారో అనే భయాందోళనలు నెలకొన్నాయని.. వాటి ప్రభావం దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ పై బలంగా పడుతుందని అంటున్నారు.