మూడోసారీ అధ్యక్ష పదవిపై పడిన ట్రంప్ కన్ను.. ఏం జరిగిందంటే?
మొండోడు రాజు కంటే బలవంతుడన్న సామెత తెలిసిందే. అయితే.. రాజే మహా మొండోడు అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన పాలన ఎలా ఉంటుంది? లాంటి ప్రశ్నలకు సమాధానం ఇట్టే అర్థమయ్యే ఉదాహరణ ఇప్పుడు ప్రపంచానికి ఉంది.
By: Tupaki Desk | 31 March 2025 5:54 AMమొండోడు రాజు కంటే బలవంతుడన్న సామెత తెలిసిందే. అయితే.. రాజే మహా మొండోడు అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన పాలన ఎలా ఉంటుంది? లాంటి ప్రశ్నలకు సమాధానం ఇట్టే అర్థమయ్యే ఉదాహరణ ఇప్పుడు ప్రపంచానికి ఉంది. ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు మించిన ఎంగ్జాపుల్ ఇంకేం ఉంటుంది? మిగిలిన దేశాల్ని పక్కన పెడితే.. అమెరికా రాజ్యంగాం ప్రకారం ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా రెండు దఫాలు మాత్రమే ఎన్నికయ్యే వీలుంది.
ఈ కారణంగానే ఎంతో ప్రజాదరణ ఉన్న నాయకులు సైతం మూడోసారి అధ్యక్ష పదవిని చేపట్టలేదు. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాలన్న పంతం.. పట్టుదలతో తాను అనుకున్నది సాధించిన ట్రంప్.. ఇప్పుడు ఫ్యూచర్ మీద మరింత ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది. రాజ్యాంగంలో పొందుపర్చిన సూత్రాల్ని తనదైన శైలిలో కొత్త అర్థాల్ని తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు ఆయన చేసిన తాజా వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పాలి.
అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావటానికి మార్గాలు ఉన్నట్లుగా పేర్కొన్న ట్రంప్.. తాను మూడోసారి బాధ్యతలు చేపట్టడాన్ని తోసిపుచ్చని వైనం సంచలనంగా మారింది. ఈ విషయంలో తాను జోక్ చేయలేదన్న ట్రంప్.. అయితే.. దీనిపై ఇప్పుడే ఆలోచించంటం తొందరపాటు అవుతుందన్న గడుసు మాట వింటే.. ఆయన ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంటుందన్న విషయంపై స్పష్టత వస్తుందని చెప్పాలి.
అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక అయ్యేందుకు అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. అయితే.. తనను మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అయితే.. అందుకు చాలానే సమయం ఉందని వారికి తాను చెప్పినట్లుగా పేర్కొన్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. మూడోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాలన్న అభిలాషను ప్రజల పేరుతో తెర మీదకు తీసుకొచ్చిన గడుసుతనం కనిపిస్తుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడోసారి అధ్యక్ష పదవి గురించి ఆలోచించటం తొందరపాటు అవుతుందన్న ట్రంప్.. తానిప్పుడు ప్రస్తుత పరిస్థితుల మీదే ఫోకస్ చేసినట్లుగా చెప్పారు. మరోసారి అధికారాన్ని చేపడతారా? అన్న ప్రశ్నకు తనకు పని చేయటం ఇష్టమన్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఉన్న మార్గాల గురించి అడగ్గా.. తాను చెప్పనని బదులు ఇవ్వటం గమనార్హం. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవిని మూడోసారి చేపట్టేందుకు ఉన్న మార్గాల్ని చూసినప్పుడు.. రాజ్యాంగ సవరణ చేయాలి. అదేమీ అంత ఈజీ కాదు.
ఎందుకంటే.. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్ లో మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలి లేదంటే మూడింట రెండొంతుల రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుంది. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడొంతుల రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. 2028లోనూ ట్రంప్ అధ్యక్షుడిగా పోటీ చేసి ఎన్నిక అవుతారని ఆయనకు బలమైన మద్దతుదారుగా వ్యవహరించే స్టీవ్ బానన్ పేర్కొన్నారు. దీనికి తమ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నట్లుగా పేర్కొనటం చూస్తే.. మూడోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలన్న అభిలాష ట్రంప్ లో ఎంత బలంగా ఉందో ఇట్టే అర్థమవుతుందని చెప్పొచ్చు. మరి.. దీనికి అమెరికన్లు ఎలా రియాక్టు అవుతారన్నది అసలు ప్రశ్న.