Begin typing your search above and press return to search.

ట్రంప్ నోటి నుంచి వచ్చిన 'ఫెంటనిల్' ఏమిటి? దాని ఎఫెక్ట్ ఎంత?

సింథటిక్ డ్రగ్స్ ముడిపదార్థాలను అక్రమంగా తరలిస్తున్న నేరగాళ్లకు చైనా అడ్డుకట్ట వేయలేకపోతుందని.. అందుకే ఆర్థిక అత్యవసర ఉత్తర్వులు జారీ చేసినట్లుగా వైట్ హౌస్ పేర్కొంది.

By:  Tupaki Desk   |   3 Feb 2025 4:31 AM GMT
ట్రంప్ నోటి నుంచి వచ్చిన ఫెంటనిల్ ఏమిటి? దాని ఎఫెక్ట్ ఎంత?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి తాజాగా వచ్చిన పదం ‘ఫెంటనిల్’. మెక్సికో.. కెనడా నుంచి వచ్చే వస్తువుల మీద సుంకాలు విధించేందుకు వీలుగా ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఆయన.. నిషేధిత ఫెంటనిల్ లాంటి మాదకద్రవ్యాలు అమెరికాలోకి అక్రమ మార్గాల్లో ప్రవేశించటం వల్ల ప్రజారోగ్యం సంక్షోభం ఏర్పడుతోందన్న ఆందోళనను వ్యక్తం చేశారు.

సింథటిక్ డ్రగ్స్ ముడిపదార్థాలను అక్రమంగా తరలిస్తున్న నేరగాళ్లకు చైనా అడ్డుకట్ట వేయలేకపోతుందని.. అందుకే ఆర్థిక అత్యవసర ఉత్తర్వులు జారీ చేసినట్లుగా వైట్ హౌస్ పేర్కొంది. అంతేకాదు.. మెక్సికోలో మాదకద్రవ్యాల అక్రమరవాణా ముఠాలతో ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. డ్రగ్స్ తయారీ.. రవాణాకు మెక్సికో సర్కారు సహకరిస్తోందని.. ఇవన్నీ అమెరికాకు చేరి.. ఓవర్ డోస్ కారణంగా ప్రతి ఏడాది వేలాది మంది అమెరికన్లు మరణిస్తున్నట్లుగా వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో అసలీ ఫెంటనిల్ ఏమిటి? దాని కతేంది? అన్న వివరాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. ముందుగా ట్రంప్ నోటి నుంచి వచ్చిన ఫెంటనిల్ విషయానికి వస్తే.. మనం వంటల్లో వినియోగించే గసగసాలు తెలుసు కదా. వీటిని తయారు చేసే మెక్కను పాపీగా వ్యవహరిస్తారు. దీని నుంచి ఓపియం అనే డ్రగ్ ను తీస్తారు. ఈ కారణంగానే పలు దేశాలు.. విదేశీయులు తమ దేశానికి వచ్చే సందర్భంగా తీసుకొచ్చే సామాన్లలో గసగసాలు ఉంటే తీవ్రమైన నేరంగా వ్యవహరిస్తారు. బ్యాన్ వస్తువుల జాబితాలో గసగసాలు కూడా ఉంటాయి.

పాపీ మొక్క నుంచి వచ్చే మార్పిన్.. కోడిన్ వంటి వాటిని ఓపియేట్స్ గా వ్యవహరిస్తుంటారు. పూర్తిగా పాపీ మొక్క నుంచి మాత్రమే కాకుండా కొంతమేర సింథటిక్ మాలిక్యూల్స్ ను ఉపయోగించి తయారుచేసే డ్రగ్స్ ను పార్షియల్లీ సింథటిక్ ఓపియాయిడ్స్ గా కూడా వ్యవహరిస్తారు. ఈ కోవలోకే హైడ్రోకోడోన్.. ఆక్సీకోడోన్.. హైడ్రో మార్ఫోనో లాంటివి ఉంటాయి. పాపీ మొక్కతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో దాన్ని అనుసరించే సింథటిక్ మాలిక్యూల్స్ తో తయారు చేసే డ్రగ్స్ ను ఓపియాయిడ్స్ గా వ్యవహరిస్తారు. ఫెంటనిల్.. మెథాడోన్.. మెపెరిడిన్ లాంటివి దీనికి ఎగ్జాంఫుల్ గా చెబుతుంటారు.

ఓపియాయిడ్స్ మొక్కల నుంచి తయారు చేసే హెరాయిన్.. ఓపియం.. మార్ఫిన్.. కోడిన్ లలో యాభై నుంచి వంద రెట్లు శక్తివంతమైనవిగా చెబుతారు. ప్రాణాంతాక వ్యాధుల కారణంగా భరించలేనంత నొప్పితో బాధ పడే వారికి నొప్పి నివారణ మందులుగా వీటిని ఇస్తుంటారు. ఇందులో భాగంగా ఫెంటనిల్కు అమెరికా ఔషధ.. ఆహార నియంత్రణ సంస్థ కూడా ఎనాల్జెసిక్.. ఎనెస్థెటిక్ లుగా వినియోగించేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ రెండూ నొప్పి నివారణకు.. మత్తు కలిగించేందుకు వీలుగా పని చేస్తాయి.

అయితే.. ఈ డోస్ కాస్త ఎక్కువైనా ప్రాణాల మీదకు తెస్తుంది. కొందరిలో 2 గ్రాముల డోస్ సైతం కోమా.. శ్వాసవ్యవస్థ ఫెయిల్ అయ్యేందుకు కారణమై ప్రాణాలు పోయేలా చేస్తుంది. ఈ డ్రగ్ ను వాడి చాలామంది అమెరికన్లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మత్తు కోసం అధిక మోతాదులో తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది. 2021లో ఫెంటనిల్ ఓవర్ డోస్ కారణంగా 1.07 లక్షల మంది ఒక్క ఏడాదిలో మరణిస్తే.. 2022లో 72 వేల మంది వరకు మరణించారు. 2023లో 75 వేల వరకు మరణించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన ఏడు స్వింగ్ రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొనే సమస్యల్లో ఫెంటనిల్ డ్రగ్ ఒకటి. అందుకే.. ట్రంప్ అధికారంలోకి వచ్చినంతనే ఫెంటనిల్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల్ని చైనా అడ్డుకోవటం లేదన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణ. అందుకే.. దీని తయారీకి అవసరమైన ముడి పదార్థాలపై 100 శాతం అదనపు సుంకాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.