Begin typing your search above and press return to search.

తొలి రోజున ఉత్తర్వులే ఉత్తర్వులు.. ఇప్పుడేం జరుగుతుంది?

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన.. క్షణం కూడా వేస్టు చేసుకోకూడదన్నట్లు ఆయన తీరు ఉంది.

By:  Tupaki Desk   |   21 Jan 2025 4:42 AM GMT
తొలి రోజున ఉత్తర్వులే ఉత్తర్వులు.. ఇప్పుడేం జరుగుతుంది?
X

మాటలు చెప్పటం వేరు. చేతల్లో చూపించటం వేరు. ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు కాస్తంత వెనుకా ముందు చూసుకొని మాట్లాడటం చేస్తుంటారు. ఎన్నికల వేళలో రాజకీయ నేతల నోటి నుంచి చాలానే మాటలు వస్తాయి. అయితే.. అధికారం చేతికి వచ్చిన తర్వాత.. తాము చేసిన వ్యాఖ్యల విషయంలో కొన్ని మార్పులు సహజంగా చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ.. ట్రంప్ విషయంలో మాత్రం అలాంటిదేమీ జరగలేదు. తాను ఏమైతే చెప్పారో.. అవన్నీ చేతల్లో చూపించటం ఖాయమన్న స్పష్టమైన సంకేతాల్ని తన తొలిరోజునే ఇచ్చేశారు. దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నిమిషాల వ్యవధిలో చేసిన ప్రసంగంలోనే ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేసేందుకు అస్సలు వెనుకాడలేదు.

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన.. క్షణం కూడా వేస్టు చేసుకోకూడదన్నట్లు ఆయన తీరు ఉంది. బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే వంద వరకు ఉత్తర్వులు జారీ చేస్తారన్న ప్రచారానికి తగ్గట్లే. తొలిరోజున పెద్ద ఎత్తున అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అవి ఎన్ని? అన్న దానిపై స్పష్టత లేనప్పటికి.. భారీ ఎత్తున ఉత్తర్వులు జారీ అయ్యాయని మాత్రం చెబుతున్నారు. వలసలపై ఉక్కుపాదం.. మెక్సికో సరిహద్దుల్లో మరిన్ని సైనిక దళాల మొహరింపు.. జన్మత: పౌరసత్వ విధానం రద్దు.. చైనా.. కెనడాలపై టారిఫ్ పెంపు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చటం లాంటివి ఇందులో ఉన్నట్లు చెబుతున్నారు.

అధికారం చేపట్టిన మొదటి రోజునే ఉత్తర్వుల జారీలో శివతాండవం చేశారన్నట్లుగా ట్రంప్ సర్కారు వైఖరి ఉందని చెప్పాలి. కొన్ని ఉత్తర్వుల వివరాలు బయటకు రాగా.. మిగిలిన ఉత్తర్వులు ఏమిటన్న దానిపై అధికారుల నుంచి సమాచారం బయటకు రాలేదు. ఇదిలా ఉండగా.. ట్రంప్ రాకతో వైట్ హౌస్ వెబ్ సైట్ కొత్త రూపు సంతరించుకుంది. అమెరికా ఈజ్ బ్యాక్ అనే హెడ్డింగ్ తో పాటు.. నా ప్రతి శ్వాస తోనూ అమెరికన్ల కోసమే పోరాడతా అంటూ ట్రంప్ సందేశాన్ని హోం పేజీలో హైలెట్ చేశారు. ట్రంప్ తాజా నిర్ణయాల్ని అప్డేట్ చేశారు.

పన్నులు.. చమురు ధరలు.. విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి.. సైన్యాన్ని ఆధునికీకరిస్తాం.. విఫల విధానాలు రద్దు అవుతాయి.. పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు తెర దించేందుకు ట్రంప్ ప్రాధాన్యమిస్తారంటూ పేర్కొంది. సోషల్ మీడియాలోని వైట్ హౌస్ ఖాతాలకు కొత్త రూపు ఇవ్వటం గమనార్హం. మొత్తానికి మొదటి రోజునే కొత్తదనాన్ని నూటికి రెండు వందల శాతం ట్రంప్ చూపించారని చెప్పాలి.