ట్రంప్ ఎఫెక్ట్ : డ్ర*గ్ లార్డ్ సహా 28 మందిని అమెరికాకు అప్పగించిన మెక్సికో
మెక్సికోలో మాదకద్రవ్యాల ముఠాలను కట్టడి చేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం కార్యరూపం దాల్చింది.
By: Tupaki Desk | 1 March 2025 3:00 PM ISTఅమెరికా అధ్యక్షుడయ్యాక ట్రంప్ దూకుడైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాట వినని సరిహద్దు పొరుగుదేశాలతో చెడుగుడు ఆడేస్తున్నారు. ఇప్పటికే కెనడాను 51వ దేశంగా కలుపుకుంటామని దుమారం రేపిన ట్రంప్.. ఇక మెక్సికోకు డ్ర*గ్స్ ను అరికట్టాలంటూ లేదంటే సుంకాల మోత మోగిస్తానంటూ హెచ్చరించారు. కెనడా కొంత తగ్గి కొంత ప్రతిఘటిస్తోంది. కానీ మెక్సికో మాత్రం ట్రంప్ దూకుడుతో ఆగమేఘాలపై స్పందించి నష్టనివారణ చర్యలు చేపడుతోంది. తాజాగా ట్రంప్ అడిగిన డ్ర*గ్ లార్డ్ సహా 29మందిని అమెరికాకు అప్పగించింది.
మెక్సికోలో మాదకద్రవ్యాల ముఠాలను కట్టడి చేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం కార్యరూపం దాల్చింది. మెక్సికోలోని ఎనిమిది ప్రధాన నగరాల జైళ్ల నుంచి 29 మంది క్రూరమైన మాదకద్రవ్యాల రవాణాదారులను అమెరికా అధికారులకు అప్పగించారు. ఈ చర్యతో ట్రంప్ సర్కారు విధించనున్న 25% అదనపు సుంకాలను నివారించేందుకు మెక్సికో ప్రభుత్వం ప్రయత్నించింది.
- అత్యంత ప్రమాదకర నిందితుల అప్పగింత
అమెరికాకు అప్పగించిన వారిలో అత్యంత దారుణమైన నేరస్తుడు ‘డ్ర*గ్ లార్డ్’ గా పిలవబడే ‘రఫెల్ కారో క్వింటెరో’ ఉన్నాడు. 1985లో అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్ (డీఈఏ) ఎన్రిక్ "కికి" కమరెనా హత్య కేసులో ఇతడు ప్రధాన నిందితుడు. 2013లో మెక్సికో న్యాయస్థానం అతనిపై ఉన్న కేసును కొట్టివేయడంతో విడుదలైన కారో క్వింటెరో మళ్లీ మాదకద్రవ్యాల రవాణాలో క్రియాశీలకంగా మారాడు. 2022లో అతడిని మరోసారి అరెస్టు చేసినప్పటికీ ఇప్పటి వరకు అమెరికాకు అప్పగించలేదు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ప్రక్రియ వేగవంతమైంది.
- అమెరికా కఠిన వైఖరి
ట్రంప్ ప్రభుత్వం మెక్సికోను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ అక్కడి మాదకద్రవ్యాల ముఠాలను అదుపులోకి తేవాలని డిమాండ్ చేసింది. ఫెంటెనిల్ వంటి ప్రమాదకర మత్తుమందుల సరఫరా నిలిపివేయాలని లేని పక్షంలో భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. ఈ ఒత్తిడి కారణంగానే మెక్సికో ప్రభుత్వం కీలక ముఠాల గ్యాంగ్‌లీడర్లను అమెరికా అధికారులకు అప్పగించింది.
- అమెరికా చర్యలపై అధికారుల స్పందన
ఈ పరిణామాలపై అమెరికా అటార్నీ జనరల్ పామెలా బోండీ మాట్లాడుతూ "అమెరికా ప్రజలను రక్షించేందుకు ధైర్యవంతులైన అధికారులు తమ జీవితాలను అంకితం చేశారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ఈ నిందితులను చట్ట ప్రకారం విచారణ చేస్తాం" అని తెలిపారు.
- చర్చలు ఫలవంతం.. మెక్సికో చరిత్రలో తొలిసారి
ఈ నేపథ్యంలో మెక్సికో విదేశాంగ మంత్రి జూవాన్ రామన్ డె లామ ఫ్యూంటే అమెరికాలో పర్యటించి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో భేటీ అయ్యారు. అదే సమయంలో మెక్సికో అమెరికాకు నిందితులను అప్పగించడం విశేషం. అమెరికా డీఈఏ మాజీ చీఫ్ మైక్ విజిల్ మాట్లాడుతూ "మెక్సికో చరిత్రలో ఇంతటి పెద్ద నేరస్తుల అప్పగింత ఇప్పటివరకు జరగలేదు. ఇది ట్రంప్ ప్రభుత్వ ఒత్తిడికి ప్రతిఫలంగా జరిగింది" అని వ్యాఖ్యానించారు.
ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా మెక్సికో మాదకద్రవ్య ముఠాలను అణిచివేస్తోంది. తమ ముఠా నాయకులను అమెరికాకు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భవిష్యత్తులో అమెరికా-మెక్సికో సంబంధాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.