Begin typing your search above and press return to search.

గాజా స్వాధీనం.. కుదరదు రాజా.. ట్రంప్ నకు ఐక్యరాజ్య సమితి ఝలక్!

అలాంటి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని బాగు చేస్తానంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

By:  Tupaki Desk   |   6 Feb 2025 7:25 AM GMT
గాజా స్వాధీనం.. కుదరదు రాజా.. ట్రంప్ నకు ఐక్యరాజ్య సమితి ఝలక్!
X

ప్రపంచంలోనే అత్యంత జన సాంద్రత.. ఎటుచూసినా శిథిలాలు.. లక్షల మంది తిరుగు వలస.. కనీసం కరంటు కూడా లేని ప్రాంతం.. తాగేందుకు మంచినీరు సైతం దొరకని దీనస్థితి.. ఇదీ గాజాలో ప్రస్తుతం పరిస్థితి. అలాంటి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని బాగు చేస్తానంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బహుశా ప్రపంచంలోనే ఎవరూ చేయని పని ఇది. ఎందుకంటే.. గాజాను బాగు చేయడం ఎవరి తరమూ కాదు. ఒక్క అమెరికాకు తప్ప.

అయితే ట్రంప్‌.. గాజాపై చేసిన వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో ఉన్నా..

ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇది గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవడమేననే అభిప్రాయం కూడా వ్యక్తం చేశాయి. మరోవైపు ట్రంప్ ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) నుంచి వైదొలగారు. గత టర్మ్ లోనే డబ్ల్యూహెచ్ వోపై కొవిడ్ విషయంలో కారాలు మిరియాలు నూరిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా సంస్థ నుంచే తప్పుకొన్నారు.

గాజాను ఉద్దేశించి ట్రంప్‌ చేసిన ప్రకటనను ఐక్యరాజ్య సమితి చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ వ్యతిరేకించారు. మరి.. సమితిని ట్రంప్‌ ఏవిధంగా ఎదుర్కొంటారో అనే ఆసక్తి నెలకొంది.

‘పాలస్తీనా ప్రజలకు వారి సొంత భూమిలో జీవించే హక్కుంది. సమితి.. అక్కడ శాంతి, స్థిరత్వం నెలకొనేందుకు పాటుపడుతుంది. పాలస్తీనా ప్రజల విడదీయరాని హక్కులకు కట్టుబడి ఉంది. గాజాపై పరిష్కారాల అన్వేషణలో మనం సమస్యను మరింత దిగజార్చొద్దు. అంతర్జాతీయ చట్టం పునాదికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. ఏ రూపంలోనైనా జాతి ప్రక్షాళనను నివారించడం చాలా అవసరం. గాజా ప్రజలు భయంకర పరిస్థితుల్లో జీవనం కొనసాగించారు. ఇప్పటికైనా పాలస్తీనియన్లకు అందరం అండగా ఉండాలి’ అని గుటెరస్ ట్వీట్ చేశారు.

మరోవైపు గాజాలో తమ దేశ సైన్యాన్ని మోహరించడానికి ట్రంప్‌ సిద్దంగా లేరని అధ్యక్ష భవన వర్గాలు చెప్పుకొచ్చాయి. గాజా పునర్‌ నిర్మాణంలో అమెరికా భాగస్వామ్యం అవసరమనేదే ట్రంప్‌ ఉద్దేశమని వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ తెలిపారు.

ఇజ్రాయెల్‌ తో యుద్ధంతో శ్మశానం తరహాలో మారిన గాజాను సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలు చేపడతామని చెప్పారు. భారీగా ఆవాస, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ట్రంప్ తెలిపారు. కానీ, ట్రంప్‌ ప్రతిపాదనపై గాజా పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంతో సొంత గూటికి వెళ్తున్నామని.. తమ ఇళ్లను విడిచిపెట్టబోమని తెలిపారు. గౌరవప్రద జీవితం కోరుకుంటున్నామని.. తమ నేలను వీడబోమని చెప్పారు. అయితే, ట్రంప్‌ ప్రతిపాదన గాజాతో పాటు పరిసర దేశాల్లో మరింత విధ్వంసం, ఘర్షణకు కారణమవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించడం గమనార్హం.