ట్రంప్ కు తగ్గకుండా సుంకం కత్తులు తీసిన ఆ 2 దేశాలు
రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాన్ని సృష్టిస్తున్నారు.
By: Tupaki Desk | 3 Feb 2025 4:34 AM GMTన్యూటన్ మూడో సూత్రాన్ని స్కూల్ టైంలోనే నేర్చుకొని ఉంటారు. చర్యకు సమానమైన ప్రతి చర్య .. వ్యతిరేక ప్రతి చర్య ఉంటుంది. ఈ సూత్రాన్ని తెలుగోళ్లు కాస్తంత తెలివిగా ఒక మాటతో చెబుతుంటారు. చెంపకు చేయి పరమైనప్పుడు కంటికి నీరు ఆదేశమవుతుందంటూ చమత్కరిస్తుంటారు. ఇలాంటి చమత్కారాల్ని పక్కన పెడితే.. పెద్దన్న అమెరికా తమ మీద తీసుకుంటున్న చర్యలకు ప్రతిగా ఆయా దేశాలు స్పందిస్తున్న తీరు చూసినప్పుడు న్యూటన్ థర్డ్ లా గర్తుకు రాక మానదు. రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాన్ని సృష్టిస్తున్నారు.
ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో రెండు దేశాలు తమదైన స్పందనను తెలియజేయటం ఆసక్తికరంగా మారింది. కెనడా.. మెక్సికో దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద సుంకాలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ధీటుగా ఆ దేశాలు స్పందించాయి. అమెరికా నుంచి తాము దిగుమతి చేసుకునే 155 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లుగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించగా.. మెక్సికో సైతం అదే తీరును ప్రకటించింది.
అమెరికా నుంచి తమ దేశానికి దిగుమతి అయ్యే 155 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల్లో 30 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై వెంటనే.. 125 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 21 రోజుల తర్వాత నుంచి సుంకాలు విధిస్తామని కెనడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ లోపు కెనడా కంపెనీలు ఆయా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలన్న సూచన చేసింది. మరోవైపు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా తమ దేశ ఆర్థిక మంత్రికి కీలక ఆదేశాలు జారీ చేవారు. మెక్సికో ప్రయోజనాల పరిరక్షణ పేరుతో ‘ప్లాన్ బి’ని అమలు చేయాలని ఆదేశించారు.
ప్లాన్ బి అంటే మరేమిటో కాదు.. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై పలు చర్యలు తీసుకోవటం.. మెక్సికోలో నేరగాళ్ల ముఠాలతో ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ చేసిన ట్రంప్ ఆరోపణల్ని ఆ దేశ అధ్యక్షురాలు తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో ఆమె నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. ‘సుంకాల విధింపుతో సమస్యలు పరిస్కారం కావు. చర్చలతోనే పరిష్కారమవుతాయి’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
మరోవైపు సుంకాల బారిన పడిన చైనా సైతం ట్రంప్ సర్కారు తీరును తప్పు పడుతూ.. తమ మీద విధించిన సుంకాలను తాము ప్రపంచ వాణిజ్య సంస్థలో సవాలు చేస్తామని పేర్కొంది. ట్రంప్ సర్కారు నిర్ణయం డబ్ల్యూటీవీ నిబంధనల తీవ్ర ఉల్లంఘనగా పేర్కొంది. మొత్తానికి సుంకాల విధింపు హుంకారంతో ట్రంప్ ఏదో చేద్దామనుకుంటే... అందుకు ధీటుగా స్పందిస్తున్న దేశాల తీరుకు ఆయన రియాక్షన్ ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.