అమెరికా గోల్డ్ కార్డ్ వీసా: భారతీయులపై ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకు గోల్డ్ కార్డ్ వీసాను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.
By: Tupaki Desk | 26 Feb 2025 9:56 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకు గోల్డ్ కార్డ్ వీసాను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిపాదన భారతీయుల్లో ఆందోళనను రేకెత్తించింది. ఇప్పటికే గ్రీన్‌కార్డ్ కోసం వేచివున్న భారతీయుల సంఖ్య అధికంగా ఉండగా, ఈ కొత్త వీసా ప్రోగ్రామ్ వల్ల అమెరికా వలస విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.
- గోల్డ్ కార్డ్ వీసా అంటే ఏమిటి?
గోల్డ్ కార్డ్ వీసా 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.43.54 కోట్లు) పెట్టుబడి పెట్టగలిగిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందించే ప్రోగ్రామ్. ఇది ఇప్పటివరకు అమల్లో ఉన్న ఈబీ-5 వీసా ప్రోగ్రామ్‌కు ప్రత్యామ్నాయంగా మారవచ్చు. ఈబీ-5 ప్రకారం 8 లక్షల నుంచి 10.5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టి 10 ఉద్యోగాలు సృష్టించాలి. కానీ, గోల్డ్ కార్డ్ వీసాలో ఉద్యోగ సృష్టికి సంబంధించిన నిబంధనలు లేవు.
- భారతీయులపై ప్రభావం ఎంతంటే?
* సంపన్న భారతీయులకు లాభం: గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయుల సంఖ్య ఎక్కువ. కానీ, 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టగలిగే సంపన్న భారతీయులకు అమెరికా పౌరసత్వం పొందడం తేలికవుతుంది. ఈ వీసా వల్ల వ్యాపారవేత్తలు, బిజినెస్ టైకూన్లు వేగంగా అమెరికా పౌరసత్వం పొందే వీలుంది.
- సాధారణ ఉద్యోగ నిపుణులకు ప్రతికూలత:
ప్రస్తుతం గ్రీన్‌కార్డ్ కోసం లైన్లో ఉన్న భారతీయులకు గోల్డ్ కార్డ్ వీసా ప్రభావం ప్రతికూలంగా ఉండవచ్చు. EB-5 వీసా ప్రోగ్రామ్‌లో ఇప్పటికే భారతీయులు పెద్ద మొత్తంలో లాభపడుతున్నారు. కానీ, గోల్డ్ కార్డ్ వీసాతో సంపన్న వర్గం మాత్రమే ప్రయోజనం పొందుతుంది.
- వలస విధానంలో మార్పులు:
గోల్డ్ కార్డ్ వీసా ప్రవేశంతో సంపన్న వర్గానికి ప్రాధాన్యం పెరుగుతుందని అర్థమవుతుంది. అమెరికా వలస విధానం ధనవంతులకు మరింత అనుకూలంగా మారుతుంది. ట్రంప్ ప్రతిపాదించిన గోల్డ్ కార్డ్ వీసా అమెరికా వలస విధానంలో కీలకమైన మార్పును సూచిస్తుంది. సంపన్న భారతీయులు దీని వల్ల లాభపడుతుండగా, గ్రీన్‌కార్డ్ కోసం వేచి ఉన్న మధ్య తరగతి వర్గం నిపుణులకు ఇది ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో దీనికి సంబంధించి మరిన్ని స్పష్టతలు రావాల్సి ఉంది. అయితే అమెరికా పౌరసత్వం కోసం ఇకపై డబ్బున్నవారికి ఎక్కువ అవకాశాలు లభించనున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది.
- అమెరికాకు , సంపన్నులకే ఈ గోల్డ్ వీసాతో లాభం
గోల్డ్ కార్డ్ విధానం ద్వారా రష్యా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులు అమెరికా గ్రీన్‌కార్డు పొందే అవకాశం పొందుతారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల జాబితాలో భారతీయులు అధికంగా ఉన్నప్పటికీ, ట్రంప్ ఈ కొత్త ఆఫర్ ద్వారా సంపన్న భారతీయులు మరింత వేగంగా తమ అమెరికా పౌరసత్వ కలను సాకారం చేసుకునే అవకాశం లభించనుంది.
గతంలో ఈబీ-5 వీసా కేటగిరీలో పెట్టుబడి పెట్టగలిగినవారికే అమెరికా గ్రీన్‌కార్డు పొందే అవకాశం ఉండేది. అయితే, తాజా ప్రతిపాదన వల్ల వృత్తి నిపుణుల కంటే వ్యాపారవేత్తలు, బిజినెస్ టైకూన్లకు ప్రయోజనం కలగనుంది. ట్రంప్ లెక్కల ప్రకారం, ఈ విధానం ద్వారా దాదాపు 10 లక్షల గోల్డ్‌కార్డులు విక్రయించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కోటి గోల్డ్‌కార్డులు విక్రయిస్తే, అమెరికా ద్రవ్యలోటును కూడా కొంత మేరకు తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
- అమెరికా కాంగ్రెస్ అనుమతి అవసరమా?
ట్రంప్ ప్రతిపాదించిన ఈ విధానం అమలు కావాలంటే అమెరికా కాంగ్రెస్ అనుమతి అవసరం లేదు. అయితే, రాజకీయ ప్రతిపక్షాలు లేదా కోర్టుల ద్వారా అభ్యంతరాలు వస్తే, దీని అమలులో జాప్యం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించిన ఖచ్చితమైన ప్రాసెసింగ్ విధానాలు, అర్హత ప్రమాణాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. సంపదతో గ్రీన్‌కార్డు పొందలేని అభ్యర్థులు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3, హెచ్-1బీ వీసా మార్గాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. మరో రెండు వారాల్లో గోల్డ్‌కార్డ్ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతం అయ్యే అవకాశం ఉంది.