Begin typing your search above and press return to search.

ట్రంప్ కోరికను తీర్చిన గూగుల్.. గల్ప్ ఆఫ్ అమెరికా

దశాబ్దాల తరబడి చరిత్రాత్మక గల్ప్ ఆఫ్ మెక్సికో పేరును గల్ప్ ఆప్ అమెరికాగా వ్యవహరించాలన్న ట్రంప్ కోరికను తీర్చింది.

By:  Tupaki Desk   |   12 Feb 2025 4:46 AM GMT
ట్రంప్ కోరికను తీర్చిన గూగుల్.. గల్ప్ ఆఫ్ అమెరికా
X

కొన్ని సందర్భాల్లో మధ్యేమర్గానికి మించిన పరిష్కారం ఇంకొకటి ఉండదు. ఇదే విషయాన్ని దిగ్గజ సెర్చింజన్ గూగుల్ పాటించింది. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన ట్రంప్.. తన చేతికి అధికారం వచ్చిన నాటి నుంచి తనకు నచ్చినట్లుగా విధానాల్ని ప్రకటిస్తున్నారు. మిగిలిన వారి అభిప్రాయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ప్రపంచానికి పెద్దన్నకు బాస్ గా ఉన్న ఆయన మాటల్ని కాదనే పరిస్థితుల్లో పలువురు ఉండలేరన్న విషయం తెలిసిందే. అలాంటి ఇబ్బందికర పరిస్థితి గూగుల్ కు ఎదురైంది.

దశాబ్దాల తరబడి చరిత్రాత్మక గల్ప్ ఆఫ్ మెక్సికో పేరును గల్ప్ ఆప్ అమెరికాగా వ్యవహరించాలన్న ట్రంప్ కోరికను తీర్చింది. తాజాగా తన సెర్చింజన్ లో ఈ మార్పును చేసింది. అయితే.. ఈ మార్పును కేవలం అమెరికాలోని వినియోగదారులకు మాత్రమే పరిమితం చేసింది. అదే సమయంలో మెక్సికో ఇంటర్నెట్ వినియోగదారులు గల్ప్ ఆఫ్ మెక్సికో అని టైప్ చేస్తే.. పాత పేరుతోనే ఫలితం వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది.

మెక్సికోతో పాటు.. మిగిలిన ప్రపంచానికి గల్ప్ ఆఫ్ మెక్సికోగా కనిపించేలాచేసిన గూగుల్.. ఈ విషయాన్ని తన మ్యాప్స్ బ్లాగ్ లో పేర్కొంది. ఇలా ఒకే ప్రాంతాన్ని వేర్వేరుగా పిలవనున్నట్లుగా తన వెబ్ మ్యాపింగ్ ప్లాట్ ఫామ్ లో పేర్కొంది. అమెరికాలో జియోగ్రాఫిక్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం అధికారికంగా గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ప్ ఆఫ్ అమెరికాగా మార్చేసింది. తాము ఈ మార్పును రెండు వారాల క్రితం ప్రకటించినట్లుగా వెల్లడించింది.

ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పేరు మార్పుకోసం కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసిన తర్వాత ఫిబ్రవరి 9న తేదీని గల్ప్ ఆఫ్ అమెరికా డేగా ట్రంప్ ప్రకటించారు. గల్ప్ ఆఫ్ అమెరికా పేరు మార్చిన తర్వాత తాను తొలిసారి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నట్లుగా వైట్ హౌస్ పబ్లిష్ చేసిన వెబ్ సైట్ డిక్లరేషన్ లో ట్రంప్ పేర్కొనటం గమనార్హం. అంతేకాదు.. తాను తీసుకున్న నిర్ణయానికి ప్రజల ఆమోదం సైతం ఉందన్న విషయాన్ని చాటి చెప్పేలా.. ఫిబ్రవరి తొమ్మిదిన వేడుకలు జరుపుకోవటం.. పలు కార్యక్రమాల్ని నిర్వహించాలని ఆయన అమెరికాప్రజలను.. అధికారులకు పిలుపునివ్వటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు... రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ప్రపంచానికి పెద్దన్న అనుకోవాలే కానీ మారనిది ఏముంటుంది?అనుకోకుండా ఉండలేం.