Begin typing your search above and press return to search.

ట్రంప్ కు తిక్కుంది.. దానికి ఓ లెక్కుంది.. ఇది అంతా తెలుసుకోవాల్సి ఉంది!

ఆ 538 మందిని లోపలేసినా, ఈ వందల మందిని బయటకు పంపేసినా.. వారంతా అక్రమ వలసదారులు.

By:  Tupaki Desk   |   26 Jan 2025 6:32 AM GMT
ట్రంప్  కు తిక్కుంది.. దానికి ఓ లెక్కుంది.. ఇది అంతా తెలుసుకోవాల్సి ఉంది!
X

అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. వైట్ హౌస్ లోకి వచ్చీ రాగానే వలసదరులపై ఉక్కుపాదం మోపే కార్యక్రమాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. తొలుత బర్త్ రైట్ సిటిజన్ షిప్ ని రద్దు చేస్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన ఆయన... ఇమ్మిగ్రేషన్స్ లో మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకూ ఓ లెక్కుందని చెబుతున్నారు.

అవును... ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, జారీ చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని బయట నుంచి చూసేవారికి తిక్క పనిలా అనిపించినా.. అమెరికన్స్ దృష్టిలో దానికి ఓ లెక్కుందని.. ట్రంప్ ప్రపంచానికి అధ్యక్షుడు కాదు, ప్రపంచం మొత్తం యోగక్షేమాలు అతని ఫస్ట్ ప్రియారిటీ కాదు.. "అమెరికా ఫస్ట్" అనేది ఆయన నినాదం అని గుర్తుచేస్తున్నారు పలువురు పరిశీలకులు.

ప్రస్తుతం అమెరికాలోని వలసదారులే ట్రంప్ లక్ష్యం అనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో విడతలవారీగా ట్రంప్ చేస్తున్న కార్యక్రమాలు.. ఆ లిస్ట్ పై ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. ఇందులో భాగంగా... ట్రంప్ ముందుగా తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులపై దృష్టి సారించారు.. అందులోనూ అలాంటి వారిలో నేర ప్రవృత్తి ఉన్నవారిపై దృష్టిసారించారు.

ట్రంప్ తాజా నిర్ణయాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. తాజాగా ట్రంప్ యంత్రాంగం 538 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసింది. వీరంతా... ఉగ్రవాదం, డ్రగ్స్ రవాణా, లైంగిక నేరాల వంటి కేసులో నిందితులుగా ఉన్నవారే. వీరి విషయంలో ట్రంప్ సర్కార్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ నేర ప్రవృత్తి లేకపోయినా.. అక్రమంగా అమెరికాలో ఉంటున్నవారు.

దీంతో... వారిని కూడా గుర్తించేపనిలో నిమగ్నమైన ట్రంప్ యంత్రాంగం తాజాగా వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేసింది. ఆ 538 మందిని లోపలేసినా, ఈ వందల మందిని బయటకు పంపేసినా.. వారంతా అక్రమ వలసదారులు. ఇప్పుడు నెక్స్ట్ ట్రంప్ టార్గెట్ అక్రమం చేస్తారేమో అనే వలసదారులు అనే చర్చ తెరపైకి వచ్చింది.

అందుకే... బీ1/బీ2 వంటి విజిటింగ్ వీసాలపై అమెరికాకు వచ్చేవారిని ట్రంప్ యాంత్రాంగం టార్గెట్ చేస్తుంది. ఒకసారి విజిటింగ్ వీసాలపై వచ్చి.. టైమ్ ముగిసినా కూడా వెళ్లకుండా ఇక్కడే తిష్ట వేసి, మరోసారి అక్రమ వలసదారుల జాబితాను పెంచే పనికి పూనుకుంటారనే సందేహంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలోనే... ఎప్పుడు తిరిగి తమ దేశానికి వెళ్లిపోతారో చెప్పే రిటన్ టిక్కెట్ లేకుండా ఎవరైనా విజిటింగ్ వీసాలపై అమెరికాలో అడుగుపెట్టినా.. తిరిగి పంపించేస్తున్నారు అధికారులు. దీని బట్టే అర్ధం అవుతుంది.. వలసదారుల విషయంలో ట్రంప్ సర్కార్ ఏ స్థాయిలో కఠినంగా వ్యవహరిస్తుందనే విషయం.

ఇక.. హెచ్-1బీ వంటి తాత్కాలిక వీసాలపై వచ్చిన వారు, గ్రీన్ కార్డుల కోసం వేచి చూస్తున్నవారి తర్వాత జనరేషన్ పైనా దృష్టి పెట్టిన ట్రంప్... బర్త్ రైట్ సిటిజన్ షిప్ ని రద్దుచేసే పనికి పూనుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. ఇది అమెరికాలో తమ పిల్లలు సెటిల్ అవ్వాలనుకునే వలసదారులకు బిగ్ ఇష్యూ!

ఇదే క్రమంలో... త్వరలో అమెరికా పౌరుల ఉద్యోగాలకు ఎసరు పెడతారు అనే ఆందోళనో ఏమో కానీ... ఆ దేశంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను టార్గెట్ చేశారు ట్రంప్. దీనికి ఆయన ఎంచుకున్న మార్గం.. నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైమ్ జాబ్స్ చేయడం. ఎవరైనా విదేశీ విద్యార్థి పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న విషయం అధికారుల దృష్టికి వెళ్తే.. రిటన్ ఫ్లైట్ ఎక్కించేస్తున్నారు!

ఇలా తమ దేశంలో అనధికరికంగా, అక్రమంగా ఉన్నవారితో పాటు.. అధికారికంగా ఉన్నవారు, రేపటి రోజున ఉండటానికి ప్రయత్నించేవారు, వారికి జన్మించబోయే పిల్లలను కూడా లక్ష్యంగా చేసుకుని ట్రంప్ "అమెరికా ఫస్ట్" అనే నినాదానికి న్యాయం చేస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. అందుకే... ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచానికి తిక్కగా అనిపించొచ్చు కానీ... దానికి ఓ పెద్ద లెక్కుందనే విషయం అమెరికన్స్ కి అర్ధమవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.