Begin typing your search above and press return to search.

వెనక్కి వెళుతున్న ట్రంప్.. మోడీ హర్ట్ అయ్యాడని టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడా?

భారతదేశంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఇటీవల అమెరికా డోజ్ విభాగం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Feb 2025 6:15 AM GMT
వెనక్కి వెళుతున్న ట్రంప్.. మోడీ హర్ట్ అయ్యాడని టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడా?
X

ఎక్కడా తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బాగా తెలుసు.. ముఖ్యంగా స్నేహం స్నేహ్నమే.. వ్యాపారం వ్యాపారమే అన్నట్టుగా ముందుకెళుతున్నాడు. నరేంద్ర మోడీ తనకు ఎంత జాన్ జిగ్రీ దోస్త్ అయినా సరే.. అమెరికా ప్రయోజనాలకు వచ్చేసరికి ట్రంప్ భారత్ కు షాకిచ్చేస్తున్నాడు. అదే సమయంలో తన ఫ్రెండ్ మోడీ హర్ట్ కాకుండా పుండుపై యాంటిమెంట్ రాసేలా వ్యవహరిస్తున్నాడు. మొత్తం నెపాన్ని గత జోబైడెన్ ప్రభుత్వంపై నెట్టేసి తాను ‘భారత్ కు నిధులు కట్ చేయడానికి కారణం జోబైడెన్ ’ అని కొత్త పల్లవి అందుకున్నాడు. ‘కర్ర విరగకుండా పాము చచ్చేలా’ కొత్త పాలసీని ట్రంప్ అమలు చేస్తున్న తీరు రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశమవుతోంది.

భారతదేశంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఇటీవల అమెరికా డోజ్ విభాగం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిధుల అంశం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

- సంపన్న భారత్‌కు ఎందుకు నిధులు అన్న ట్రంప్?

ట్రంప్ మాట్లాడుతూ, "భారతదేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు మనం 21 మిలియన్ డాలర్లు ఖర్చు చేయడం ఎందుకు? భారత్ దగ్గర చాలా డబ్బుంది.. వారు ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తారు. వారికి బయట నిధులు అవసరం లేదు. బహుశా బైడెన్ ప్రభుత్వం అక్కడ మరెవరినో గెలిపించడానికి ఈ నిధులను ఖర్చు చేసి ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయాలి. అదే కీలక ముందడుగు అవుతుంది" అని వ్యాఖ్యానించారు.

-అమెరికన్ ఫస్ట్ పాలసీ:

ట్రంప్ తన "అమెరికన్ ఫస్ట్" విధానాన్ని కొనసాగిస్తూ, అమెరికా బయటకు అందించే సాయాన్ని తగ్గించాలనే తన నినాదాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలోనూ విదేశాలకు అమెరికా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని కట్ చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం అధ్యక్ష పదవిలోకి వచ్చాక దాన్నే అమలు చేస్తున్నారు. మోడీ తన స్నేహితుడైనా కూడా భారత్ కు నిధులు కట్ చేసి అమెరికా ఫస్ట్ నినాదం విషయంలో తగ్గేదేలే అని నిరూపించుకున్నాడు. అదే సమయంలో మోడీని కూల్ చేయడానికి కొత్త పల్లవి అందుకున్నారు.

- మోడీ-ట్రంప్ సంబంధం:

గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీతో సాన్నిహిత్యం కొనసాగించారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పుడు మోడీ ప్రధాని పదవిలో దేశానికి వచ్చి వెళ్లాక.. భారత్‌పై విమర్శలు చేయడం, నిధుల అంశాన్ని ప్రస్తావించడం విశేషంగా మారింది. "భారత్‌కు మనం ఎందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలి? వారివద్ద చాలా డబ్బు ఉంది. వారు ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో ఒకటి. వారు విధించే సుంకాలు చాలా ఎక్కువ" అని ట్రంప్ విమర్శించారు. దీంతో మోడీ ఉన్నప్పుడు సాఫ్ట్ గా మాట్లాడి.. వెళ్లిపోయాక ట్రంప్ తన అసలు నైజాన్ని బయటపెట్టినట్టైంది.

- ట్రంప్ మాట మార్చడం:

అయితే, ఈ వ్యాఖ్యలతో మోడీ హర్ట్ అయ్యారని ట్రంప్ గ్రహించినట్టున్నారు. అందుకే తాజాగా ఆయన తన మాట మార్చారు. ఆయన తాజా ప్రకటనలో, "బైడెన్ ప్రభుత్వం భారతదేశంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు నిధులు ఇచ్చింది, వాస్తవానికి అది వేరే ఎవరినో గెలిపించడానికి" అంటూ ఆరోపించారు. దీని ద్వారా ట్రంప్ తన ప్రాథమిక లక్ష్యం మోడీని ప్రసన్నం చేయడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ మొదటిగా నిధుల అంశాన్ని ఉద్దేశించి విమర్శలు చేసినప్పటికీ, మోడీ అసహనానికి గురయ్యారని అర్థం చేసుకున్న తర్వాత టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారని అనిపిస్తోంది. ఈ వ్యాఖ్యల ద్వారా ట్రంప్ తన మద్దతుదారులను సంతృప్తిపరచడమే కాకుండా, మోడీ అనుకూలంగా ఉండేలా తన వైఖరిని సవరించుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదంతా చూస్తే, అమెరికా రాజకీయాల్లో కూడా భారతదేశంపై ఎఫెక్ట్ ఉండడం స్పష్టంగా తెలుస్తోంది. ట్రంప్, బైడెన్ మధ్య విభేదాలు అంతర్జాతీయ వ్యవహారాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఆర్థిక సహాయం, ఎన్నికల వ్యూహాలు, విదేశాంగ విధానాలు కీలకంగా మారిన ఈ సమయంలో ట్రంప్ తాజా మాట మార్చే ధోరణి మరిన్ని రాజకీయ చర్చలకు దారి తీయొచ్చు.