ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంపై ట్రంప్... స్కూల్ గ్రౌండ్ లో పిల్లల ఫైట్!
ఈ క్రమంలో ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య సంఘర్షణను స్కూల్ ప్రాంగణంలో ఇద్దరు పిల్లల ఫైట్ తో పోల్చారు డొనాల్డ్ ట్రంప్!
By: Tupaki Desk | 2 Oct 2024 8:07 AM GMTప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు రెండు విషయాలు అత్యంత హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఇందులో ఒకటి అమెరికా అధ్యక్ష ఎన్నికలు కాగా.. మరొకటి, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న రాకెట్ల దాడి! ఈ క్రమంలో ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య సంఘర్షణను స్కూల్ ప్రాంగణంలో ఇద్దరు పిల్లల ఫైట్ తో పోల్చారు డొనాల్డ్ ట్రంప్!
అవును... ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న సంఘర్షణను స్కూల్ గ్రౌండ్ లోని ఇద్దరు పిల్లలతో పోల్చారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇదే సమయంలో... ఇజ్రాయెల్ పై రాకెట్ దాడి వంటి సంఘటనలు ఎప్పుడూ జరగకూడదని.. మధ్యప్రాచ్యంలో అమెరికా లోతుగా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ తెలిపారు.
ఇదే సమయంలో... ఇది భయంకరమైన యుద్ధం అని.. ఈ రోజు కూడా ఏమి జరుగుతుందో అంతా చూస్తారని.. వారు ఒక్క రోజే సుమారు 200 రాకెట్లను కూల్చివేశారు.. అయితే ఎవరికైనా జీవించే హక్కు ఉంటుంది కాబట్టి మిడిల్ ఈస్ట్ లో తాము స్పష్టంగా పాల్గొనబోతున్నామంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా... హిజ్ బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతిస్పందనగా ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్ పై సుమారు 200 క్షిపణులను ప్రయోగించింది. అయితే యూఎస్ మిలటరీ, ఇతర ఏజెన్సీల సాయంతో వాటిలో మెజారిటీ క్షిపణులను ఇజ్రాయెల్ అడ్డగించి నాశనం చేసింది. ఈ వ్యవహారంపై నెతన్యహు ఘాటుగా స్పందించారు.
ఇందులో భాగంగా... ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని.. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యహు వెల్లడించారు. మరోపక్క ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్... ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడికి ఇజ్రయెల్ రియాక్షన్ ఎలా ఉంటుందో అనే విషయంపై చర్యలు జరుగుతున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో... పశ్చిమాసియాలో ఇరాన్ ఓ ప్రమాదకర దేశమని.. అస్థిరపరిచే శక్తి అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో... ఇది ప్రపంచ విపత్తుకు చాలా దగ్గరగా ఉందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.