షేక్ హ్యాండ్ తో మొదలు పెట్టి.. చిరునవ్వుతో ట్రంప్ ను ఉతికేసింది
ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతకు కొత్త అర్థాన్ని ఇచ్చారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో ఉన్న కమలా హారిస్.
By: Tupaki Desk | 12 Sep 2024 4:23 AM GMTముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతకు కొత్త అర్థాన్ని ఇచ్చారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో ఉన్న కమలా హారిస్. తిట్లు.. విమర్శలు.. ఆగ్రహావేశాలు మాత్రమే రాజకీయం కాదని.. అంతకు మించినవి చాలానే ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ఎదిగే కొద్దీ ఎలా వ్యవహరించాలన్న అంశాల్ని తన చేతలతో చూపించారు ఆమె. ఎంతటోడైనా సరే.. ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తూ.. వ్యక్తిగత నిందలకు పోకుండా.. విధానపరమైన అంశాల్ని లెవనెత్తటం ద్వారా అధిక్యతను ప్రదర్శించొచ్చన్న విషయాన్ని ఆమె తన తీరుతో స్పష్టం చేశారు.
ట్రంప్ -కమలా హారిస్ మధ్య జరిగిన మొదటి డిబేట్ లో కమలా హారిస్ ఎంట్రీ నుంచి ఎండింగ్ వరకు ఆసక్తికర తీరును ప్రదర్శించారు. ప్రత్యర్థిని శత్రువుగా చూసే ధోరణి ట్రంప్ కు ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ వ్యవహారశైలికి భిన్నంగా కమలా హారిస్ మాత్రం రాజకీయ ప్రత్యర్థిని.. ప్రత్యర్థిగా మాత్రమే చూస్తూ.. శత్రువుగా భావించన్న సందేశాన్ని తాజా డిబేట్ లో చెప్పకనే చెప్పేశారు. డిబేట్ ఆరంభంలో ట్రంప్ నకు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆమె.. డిబేట్ జరిగిన 90 నిమిషాలు చిరునవ్వుతో బదులు ఇవ్వటం.. ఆవేశానికి గురి కాకుండా వ్యవహరించటం ద్వారా అందరిని ఆకర్షించారు.
2021లో అధ్యక్ష ప్రమాణస్వీకారోత్సవానికి ట్రంప్ హాజరు కాలేదు. ఈ కారణంగా ట్రంప్ - కమలా హారిస్ ముఖాముఖిన ఎదురుపడటం ఇదే తొలిసారి. చర్చా వేదికపై ట్రంప్ దగ్గరకు వెళ్లి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆమె.. డిబేట్ ఆరంభంలోనే ట్రంప్ పై ఊహించని విధంగా ఎదురుదాడికి దిగారు. ‘‘మనం రెండు విభిన్నమైన విజన్ లను వినబోతున్నాం. ఒకటి భవిష్యత్తుకు భరోసా కల్పించేది. మరొకటి దేశాన్ని వెనక్కి తీసుకెళ్లేది’’ అంటూ చర్చను ప్రారంభించటం ద్వారా తన అధిక్యతను ప్రదర్శించారు.
రాజకీయాలు అంటే ఆవేశాలు.. ఆగ్రహాల్ని వ్యక్తీకరించటం కాదు.. ప్రజల సమస్యల మీదా.. పాలన మీదా ఫోకస్ చేయటం అన్న విషయాన్ని తన తీరుతో చెప్పేశారు కమలా హారిస్. ట్రంప్ మాత్రం ఎప్పటిలానే తన ప్రధాన అస్త్రమైన ద్వేషాన్ని.. ఆగ్రహాన్ని ప్రదర్శించారు. వ్యక్తిగత నిందలతో విరుచుకుపడ్డారు. డిబేట్ ముగిసే సమయానికి అందరికి తెలిసిన తీరును ట్రంప్ ను ప్రదర్శించి పాత చింతకాయ మాదిరి కనిపిస్తే.. రాజకీయం ద్వేషానికి చిరునామా కాదన్న రీతిలో వ్యవహరించిన కమలా హారిస్ తన అధిక్యతను ప్రదర్శించారు. కమల వ్యూహాన్ని గుర్తించిన ట్రంప్ టీం.. ఆయన్ను అలెర్టు చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినా.. ఆయన మాత్రంవాటిని పట్టించుకోకుండా విరుచుకుపడటం చూస్తే.. కమల విషయంలో ఆయన ఎంత ఆగ్రహంగా ఉన్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.