మీ ‘డోజ్’ కుదరదు.. ట్రంప్ నకు మరో మొట్టికాయ.. ఈసారి మస్క్ కూ
జన్మతః పౌరసత్వం రద్దు విషయంలో ఫెడరల్ కోర్టుల చేతిలో ఇప్పటికే మొట్టికాయ తిన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
By: Tupaki Desk | 14 March 2025 4:47 PM ISTజన్మతః పౌరసత్వం రద్దు విషయంలో ఫెడరల్ కోర్టుల చేతిలో ఇప్పటికే మొట్టికాయ తిన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అత్యవసర పిటిషన్‌గా విచారణ చేట్టాలంటూ దీనిని ఆయన సవాల్ చేశారు. ఆ పరిస్థితి అలా ఉండగానే ట్రంప్ నకు మరో మొట్టికాయ పడింది. ఈసారి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో కలిపి కావడమే ఇక్కడ ఆశ్చర్యకర అంశం.
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అవుతూనే ప్రభుత్వ యంత్రాంగంలో ప్రక్షాళన అంటూ మస్క్ సారథ్యంలో డోజ్ విభాగం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వేలమందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అయితే, దీనికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తీసేసిన వేల మంది ఫెడరల్ ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కాలిఫోర్నియా ఫెడరల్ న్యాయమూర్తి విలియమ్స్ అల్‌సప్ ఉత్తర్వులిచ్చారు. 6 ఫెడరల్ ఏజెన్సీల నుంచి తొలగించిన వేలమంది ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని ఆదేశించారు.
మీ చర్య బూటకం..
డోజ్ విభాగం చర్యలు బూటకం అంటూ జడ్జి విలియమ్స్ అల్‌సప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో న్యాయశాఖ వాదనలను ఆయన కొట్టిపారేశారు.
సైన్యం, వ్యవసాయం, రక్షణ, ఖజానా శాఖలతో పాటు మరో రెండు శాఖల ఉద్యోగులను డోజ్ తొలగించింది. వీరందరినీ విధుల్లోకి తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. ఇవి అన్ని ఫెడరల్ ఏజెన్సీలకూ వర్తిస్తాయని కూడా స్పష్టం చేశారు. కాలిఫోర్నియా జడ్జి ఆదేశాలను ట్రంప్ సవాల్ చేయొచ్చని తెలుస్తోంది.
అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ట్రంప్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు, వృథా ఖర్చులకు కత్తెర, దుబారాకు అడ్డుకట్ట, అవినీతి నిర్మూలన, ఫెడరల్ సంస్థల పునర్మిర్మాణం.. డోజ్ లక్ష్యాలు. అందుకే ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. నాసా, విద్యా శాఖ, సైన్యం సహా ట్రంప్ అధ్యక్షుడైన 2 నెలల్లో 62,530 మందిని తొలగించారు.