Begin typing your search above and press return to search.

బోర్డర్ కు తుపాకులతో రెవెన్యూ స్టాఫ్... ట్రంప్ కే ఇలాంటివి సాధ్యమా?

ఈ క్రమంలో ఇప్పటికే వలసదారులకు వరుస షాకులు ఇచ్చిన ట్రంప్.. తాజాగా స్వదేశంలోని రెవెన్యూ స్టాఫ్ పై దృష్టి సారించారు.

By:  Tupaki Desk   |   26 Jan 2025 4:30 PM GMT
బోర్డర్ కు తుపాకులతో రెవెన్యూ స్టాఫ్... ట్రంప్ కే ఇలాంటివి సాధ్యమా?
X

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, జారీ చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు, చేస్తున్న కామెంట్లు, ఇస్తున్న స్టేట్ మెంట్లు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే వలసదారులకు వరుస షాకులు ఇచ్చిన ట్రంప్.. తాజాగా స్వదేశంలోని రెవెన్యూ స్టాఫ్ పై దృష్టి సారించారు.

అవును... అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రికార్డ్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని జారీ చేస్తూ పలు సంచలనాలు సృష్టిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ వ్యయాలు తగ్గించే పనిని చురుగ్గా ముందుకు తీసుకెళ్లే క్రమంలో.. దేశంలో పన్నులు వసూళ్లు చేసే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ లో కొత్తగా చేరిన స్టాఫ్ పై కీలక ప్రకటన చేశారు.

ఇందులో భాగంగా... ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసులో కొత్తగా చేరిన 90,000 మంది ఏజెంట్లను బోర్డర్లకు పంపనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాలపై తాజాగా స్పందించిన ఆయన... వారిని తొలగించడమో. లేదా, వారి చేతిలో తుపాకులు పెట్టి సరిహద్దులకు పంపడమో చేయడమే సరైన పని అని తాను అనుకొంటున్నట్లు వ్యాఖ్యానించారు.

వాస్తవానికి ట్రంప్ అధికారంలోకి రాగానే.. ఫెడరల్ ఉద్యోగుల నియామకాలను 90 రోజుల పాటు హోల్డ్ లో పెడుతూ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో.. నేషనల్ సెక్యూరిటీ, పీపుల్స్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ కి మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే.. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ విభాగం మాత్రం "డోజ్" ఆదేశాలు ఇచ్చేవరకూ ఆపేయాలసిందే.

ఇలా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ డిపార్ట్మెంట్ పై సరికొత్త ఆలోచన చేస్తోన్న ట్రంప్.. త్వరలో ఎక్స్ట్రనల్ రెవెన్యూ సర్వీస్ ను ప్రారంభించనున్నారని అంటున్నారు. విదేశాల నుంచి వచ్చే పన్నులు, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయలు, మొదలైనవి ఇదే వసూలు చేస్తుంది, పర్యవేక్షిస్తుంది. దీంతో... ట్రంప్ ఆలోచనలపై ఆసక్తికర చర్చ మొదలైందని అంటున్నారు.