ఆ 41 దేశాల వారికి అమెరికాలోకి నో ఎంట్రీ?
ఈ మేరకు ఓ ఇంటర్నల్ మెమో లీక్ అయ్యిందని, ఇందులో ఆయా దేశాలను మూడు గ్రూప్‌లుగా విభజించినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 15 March 2025 12:29 PM ISTఉద్యోగాల కోతలు, విదేశాలపై సుంకాలు వంటి ఆర్థిక చర్యలతో దూకుడు పాలన కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అమెరికాలోకి కొన్ని దేశాల పౌరుల ప్రవేశాన్ని నిషేధించేందుకు ట్రంప్ సర్కారు సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. మొత్తం 41 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించే అంశాన్ని ఆయన ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఓ ఇంటర్నల్ మెమో లీక్ అయ్యిందని, ఇందులో ఆయా దేశాలను మూడు గ్రూప్‌లుగా విభజించినట్లు తెలుస్తోంది.
గ్రూప్-1: పూర్తి నిషేధం
ఈ జాబితాలో మొత్తం 10 దేశాలు ఉన్నట్లు సమాచారం. అందులో అఫ్గానిస్థాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పౌరులకు అమెరికా వీసాలను పూర్తిగా నిలిపివేయనున్నారని సమాచారం.
-గ్రూప్-2: పాక్షిక ఆంక్షలు
ఈ జాబితాలో ఇరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ దేశాలు ఉన్నాయి. వీటి పౌరులకు పర్యాటక, విద్యార్థి వీసాల జారీ నిలిపివేయాలని నిర్ణయించామని మెమోలో పేర్కొన్నారు. అయితే కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
-గ్రూప్-3: షరతులతో కూడిన వీసా జారీ
పాకిస్థాన్, భూటాన్ సహా 26 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాలకు 60 రోజుల్లోపుగా తమ భద్రతా విధానాల్లో మార్పులు చేయాలని సూచించారు. వారు చర్యలు తీసుకోకపోతే, వీసా జారీని పాక్షికంగా నిలిపివేయాలని అమెరికా యంత్రాంగం భావిస్తోంది.
అమెరికా మీడియా ఈ జాబితాను ప్రచారం చేయగా, అధికారికంగా ఇంకా మార్పులు జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆమోదం పొందిన అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
ఇది ట్రంప్ తీసుకున్న మొదటి నిర్ణయం కాదు. గతంలోనూ, ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఇరాన్ సహా ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై ప్రయాణ నిషేధం విధించారు. ఆ నిషేధాన్ని అమెరికా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
2023లోనూ ట్రంప్ ఈ ప్రణాళిక గురించి ప్రస్తావించారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపడితే గాజా స్ట్రిప్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ వంటి దేశాల పౌరుల రాకపై ఆంక్షలు విధిస్తానని ప్రకటించారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులను అమెరికాలోకి రానివ్వబోమని స్పష్టం చేశారు.