మాటల్లో.. ఆటల్లో ట్రూడో చేతిలో భంగపడ్డ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి పొరుగుదేశం కెనడాతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
By: Tupaki Desk | 22 Feb 2025 9:30 PM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి పొరుగుదేశం కెనడాతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ట్రంప్ పాలన ప్రారంభమైనప్పటి నుండి కెనడాపై విధించిన సుంకాలు, వ్యాపార పరమైన ఒత్తిళ్లు ఆ దేశంతో సంబంధాలను మరింత కఠినతరం చేశాయి. అంతేకాదు కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా అభివర్ణించడం వివాదాస్పదమైంది.
ఇలాంటి రాజకీయ ఉద్రిక్తతల నడుమ అమెరికా-కెనడా ఐస్ హాకీ మ్యాచ్ మరింత ఆసక్తిగా మారింది. బోస్టన్ వేదికగా 4 నేషన్స్ ఫేస్-ఆఫ్ ఐస్ హాకీ టోర్నమెంట్‌లో రెండు దేశాల జట్లు ఫైనల్ పోరుకు దిగాయి. మ్యాచ్‌కు ముందు ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘‘త్వరలోనే మన 51వ రాష్ట్రంగా మారే కెనడాపై గ్రేట్ అమెరికా హాకీ జట్టు విజయం సాధిస్తుందని విశ్వసిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.
అయితే ఫైనల్ పోరులో అమెరికా జట్టు నిరాశ చెందాల్సి వచ్చింది. కెనడా జట్టు అదిరిపోయే ప్రదర్శన కనబరిచి విజయం సాధించింది. ఈ విజయంతో ఉత్సాహంతో నిండిపోయిన కెనడియన్లు ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ముఖ్యంగా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఘాటు వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ అనంతరం తన ఎక్స్ ఖాతాలో ట్రంప్‌కు కౌంటర్ ఇస్తూ.. ‘‘మీరు మా దేశాన్ని తీసుకోలేరు.. మా గేమ్‌ను కూడా తీసుకోలేరు’’ అంటూ ఘాటుగా స్పందించారు.
ట్రూడో వ్యాఖ్యలు కెనడియన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపగా, అమెరికా అభిమానుల్లో నిరాశను మిగిల్చాయి. హాకీ కెనడాకు గర్వస్పదమైన క్రీడగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కెనడియన్లలో ఆగ్రహాన్ని రేపాయి. హాకీ మ్యాచ్ కేవలం ఆట మాత్రమే కాకుండా, రెండు దేశాల మధ్య రాజకీయం కూడా కలిసిపోయినట్లు కనిపించింది.
ఈ మ్యాచ్ విజయం కెనడా జట్టుకు గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అమెరికా-కెనడా మధ్య ఉత్కంఠ భరితమైన మ్యాచ్ మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ తతంగం హాకీ అభిమానులను మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులను కూడా ఆకర్షించింది. ఇది కేవలం ఒక గేమ్ కాదు.. రెండు దేశాల మధ్య మౌనంగా కొనసాగుతున్న రాజకీయ పోరుకు ఒక సంకేతంగా మారింది!