ట్రంప్ మరో సంచలనం.. వారికి మరణశిక్షలు విధిస్తాం
అధికార పగ్గాలు చేపట్టే మొదటి రోజు నుంచే దూకుడుగా వ్యవహరించాలన్న ఆలోచనలో ఉన్న ట్రంప్ అందుకు తగ్గట్లే.. గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 25 Dec 2024 6:19 AM GMTకొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 2024కు గుడ్ బై చెప్పేస్తూ.. కొత్తగా రానున్న 2025కు వెల్ కం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. కొత్త సంవత్సరంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్న డొనాల్డ్ ట్రంప్.. పదవీ బాధ్యతలు చేపట్టక ముందే వరుస పెట్టి సంచలన ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన పాలన ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఆయన క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టే మొదటి రోజు నుంచే దూకుడుగా వ్యవహరించాలన్న ఆలోచనలో ఉన్న ట్రంప్ అందుకు తగ్గట్లే.. గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.
మొదటి రోజునే తన పాలనకు సంబంధించిన పాలసీలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని నికచ్ఛిగా చెప్పేస్తున్న ట్రంప్.. తొలి రోజునే పదుల సంఖ్యలోని ఫైళ్లపై సంతకాలు చేసేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఇరుగు పొరుగు దేశాలతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలతో అమెరికా సంబంధాలు తన హయాంలో ఎలా ఉంటాయన్న దానిపై క్లారిటీ ఇస్తున్న ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలుగుతున్న జో బైడెన్.. ఫెడరల్ మరణ శిక్షను ఎదుర్కొంటున్న నలభై మంది ఖైదీల్లో 37 మందికి మరణశిక్షను తగ్గించిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై ట్రంప్ తాజాగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులో.. ‘‘జో బైడెన్ దేశంలోని 37 మంది హంతకులకు మరణశిక్షను తగ్గించారు. నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేపిస్టులు.. హంతకులకు మరణ శిక్ష అమలు చేయాలని న్యాయశాఖను ఆదేశిస్తా. ఈ చర్య అమెరికన్ ప్రజలను రక్షిస్తుంది. దేశంలో మళ్లీ శాంతిభద్రతలు పునరుద్ధరిస్తా’’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అమెరికా విషయానికి వస్తే.. ఆ దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు.. చట్టాలు ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే మరణశిక్షల్ని అమలు చేస్తున్నారు. తోటి ఖైదీల్ని హత్య చేయటం.. బ్యాంకు దోపిడీల వేళ హత్యలకు పాల్పడిన వారికి మాత్రమే మరణశిక్షల్ని అమలు చేస్తున్నారు. దీని కారణంగా 1988నుంచి 2021 వరకు మొత్తం 79 మందికి మరణశిక్షను విధించారు.అయితే.. అత్యంత అరుదుగానే మరణశిక్షల్ని అమలు ఉంటుంది. శిక్ష పడినోళ్లలో ఇప్పటివరకు 16 మందికి మాత్రమే శిక్ష అమలు చేశారు.
ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చే వరకు ఫెడరల్ ఖైదీలకు మరణశిక్షను అమలు చేయలేదు. కానీ.. ఆయన అధికారాన్ని చేపట్టిన ఆర్నెల్ల వ్యవధిలోనే 13 మందికి మరణశిక్షను అమలు చేశారు. చివరి మరణశిక్ష 2021 జనవరి 16న అమలైంది. తాజాగా జో బైడెన్ 37 మందికి మరణ శిక్ష నుంచి తక్కువ శిక్షకు తగ్గించిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్య సంచలనంగా మారింది. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు మరణశిక్షను పూర్తిగా రద్దు చేశాయి. ఆరు రాష్ట్రాలు వీటిని తాత్కాలికంగా నిలిపవేశాయి. ట్రంప్ తాజా సోషల్ పోస్టుతో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.