Begin typing your search above and press return to search.

మూడేళ్లు నాన్చి.. ‘నాటో’ లేదు గీటో లేదు పో.. జెలెన్ స్కీకి ట్రంప్ బిగ్ షాక్

మూడేళ్లు.. సరిగ్గా మూడేళ్లు.. 2022 ఫిబ్రవరిలో మొదలైంది ఉక్రెయిన్-రష్యా యుద్ధం. నీకెందుకు మేమున్నాం.. అంటూ నాటో సభ్యత్వం పేరిట ఉక్రెయిన్ ను రెచ్చగొట్టాయి అమెరికా సహా వెస్ట్రన్ కంట్రీస్.

By:  Tupaki Desk   |   13 Feb 2025 8:20 AM GMT
మూడేళ్లు నాన్చి.. ‘నాటో’ లేదు గీటో లేదు పో.. జెలెన్ స్కీకి ట్రంప్ బిగ్ షాక్
X

ఉక్రెయిన్ పై రష్యా యుద్దానికి ఎందుకు దిగింది..? ఒకప్పటి తమ భూభాగమే అయిన దేశంపై పుతిన్ ఎందుకు అంత కసిగా విరుచుకుపడుతున్నారు..? దీనికి కారణం ఉక్రెయిన్.. అమెరికా సహా వెస్ట్రన్ కంట్రీస్ సారథ్యంలోని నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరాలనుకోవడమే.. ఉక్రెయిన్ గనుక నాటో సభ్య దేశమైతే అమెరికా సహా వెస్ట్రన్ కంట్రీస్ సైన్యం ఉక్రెయిన్ లో తిష్ఠ వేస్తుంది. అంటే..రష్యా సరిహద్దులో శత్రు సైన్యం అన్నమాట. అందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్ అంత నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తున్నారు.

మూడేళ్లు.. సరిగ్గా మూడేళ్లు.. 2022 ఫిబ్రవరిలో మొదలైంది ఉక్రెయిన్-రష్యా యుద్ధం. నీకెందుకు మేమున్నాం.. అంటూ నాటో సభ్యత్వం పేరిట ఉక్రెయిన్ ను రెచ్చగొట్టాయి అమెరికా సహా వెస్ట్రన్ కంట్రీస్. ఆయుధాలు, మందుగుండు దండిగా అందించి రష్యాపై దాడికి ఉసిగొల్పాయి. ఇదిగో అదిగో నాటో సభ్యత్వం అంటూ మూడేళ్లు ఊరించాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఇప్పటికీ నాటో సభ్యత్వం మాత్రం దక్కలేదు.

తీరా యుద్ధం ఓ దశకు వచ్చాక అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఉక్రెయిన్ మీద రష్యాను మించిన బాంబు వేశారు. ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ప్రాక్టికల్‌ గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ట్రంప్.. పుతిన్‌ కు ఫోన్ చేసి గంటన్నర మాట్లాడిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ తో శాంతి చర్చల్లో రష్యా ప్రధాన డిమాండ్లలో నాటో సభ్యత్వం తీసుకోకూడదనేది ఒకటి కావడం గమనార్హం.

పుతిన్ తో శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియాలో భేటీ కావొచ్చని ట్రంప్‌ పేర్కొన్నారు. తేదీ తేలకున్నా.. త్వరలోనే ఉంటుందన్నారు. చర్చల్లో సౌదీ యువరాజు కూడా భాగం అవుతారని వెల్లడించారు.

కాగా, ఉక్రెయిన్ కు చెందిన 40 శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. ఇందులో 2014 యుద్ధం నాటి క్రిమియాతో పాటు ఇప్పటి యుద్ధంలో ఆక్రమించిన డాన్ బాస్ ప్రాంతం తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ భూమిని ఉక్రెయిన్‌ తిరిగి పొందే అవకాశాల్లేవని ట్రంప్‌ బాంబు పేల్చారు. అంటే ఉక్రెయిన్.. అమెరికా సహా వెస్ట్రన్ కంట్రీస్ ను నమ్ముకుని నిలువెల్లా మునిగింది అన్నమాట.