అమెరికాలో అక్రమంగా ఉన్న మనోళ్ల లెక్కంత?
అమెరికా నుంచి బయలుదేరిన ఈ విమానం మధ్యలో ఇంధనం నింపుకోవటానికి జర్మనీలోని రాంస్టీన్ లో ఆగింది.
By: Tupaki Desk | 5 Feb 2025 5:13 AM GMTరెండోసారి అమెరికా అధ్యక్షపదవిని చేపట్టిన రోజు నుంచే ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయుల మీద ట్రంప్ ఎంత కఠినంగా ఉన్నారో తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలకు చెందిన వారిని వారి దేశాలకు పంపిన అమెరికా.. తాజాగా 205 మంది భారతీయుల్ని ప్రత్యేక విమానంలో పంపేయటం తెలిసిందే. సీ17 అనే సైనిక విమానంలో వారిని టెక్సాస్ లోని శాన్ ఆంటోనియో నుంచి పంజాబ్ లోని అమ్రత్ సర్ కు వెనక్కి పంపారు. ఈ విమానం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరిన వైనాన్ని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. అమెరికా నుంచి బయలుదేరిన ఈ విమానం మధ్యలో ఇంధనం నింపుకోవటానికి జర్మనీలోని రాంస్టీన్ లో ఆగింది.
ఈ విమానం భారత్ కు చేరుకోనుంది. కాకుంటే.. ఈ విమానంలో తిప్పి పంపిన వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమానంలో గౌరప్రదంగా అయితే 140 మందికి మాత్రమే ప్రయాణించే వీలుంది. అందుకు భిన్నంగా 205 మందిని తరలించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. అఫ్గానిస్థాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టిన వేళలో.. ఇలాంటి విమానాల్లో 600-800 మందిని తరలించిన వైనంతో పోలిస్తే.. ఇది తక్కువేగా అన్న వాదనను వినిపిస్తున్నాయి. అమెరికాకు మిత్రదేశంగా.. అత్యంత నమ్మకస్తుడి హోదాలో ఉన్నప్పుడు ఇలా ఎలా వ్యవహరిస్తారు? అన్నది ప్రశ్నగా మారింది.
ఇంతకూ అమెరికాలో చట్టవిరుద్దంగా ఉన్నమనోళ్లు ఎందరు? వారిని చట్టవిరుద్ధమైన పౌరులుగా ఎలా గుర్తిస్తారు? అన్న దానిపై పలువురికి ఉన్న సందేహాలకు సమాధానాలు వెతికితే.. పలు అంశాలు వెలుగు చూస్తాయి. ఇంతకూ ఎవరిని తిరిగి పంపించేస్తున్నారు? అన్న విషయాన్నిచూస్తే.. అమెరికాలో ఉండటానికి సరైన పత్రాలు లేని.. అక్రమంగా దేశంలోకి ఎంట్రీ అయిన వారిని తిరిగి పంపుతున్నారు. ఇలా తిప్పి పంపే వారి కోసం వాణిజ్య.. సైనిక అవసరాల కోసం వినియోగించే భారీ విమానాల్ని వినియోగిస్తున్నారు.
మరి.. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులు ఎందరు? అన్నది మరో ప్రశ్న. దీనికి బ్లూంబర్గ్ అంచనా ప్రకారం 18వేల మంది వరకు భారతీయుల్ని ఇప్పటివరకు గుర్తించినట్లు చెబుతున్నారు. అమెరికా హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407గా చెబుతుననారు. వీరి నుంచి సరైన పత్రాలు లేవని చెబుతున్నారు. ఇందులో 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఇవన్నీ 2022 నాటి లెక్కలని.. ప్రస్తుతం మరింత ఎక్కువ మంది ఉన్నట్లుగా భావిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయుల సంఖ్య దగ్గర దగ్గర 7,25,000 మంది ఉంటారని చెబుతున్నారు. ఇంత భారీ సంఖ్యలో భారత్ కు తిరిగి వస్తే.. అదో పెద్దతలనొప్పిగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవ కోణంలో అంత మందిని తరలించటం సాధ్యమేనా? అన్నది మరో ప్రశ్న.