రెండు వైపుల వాదనలు నచ్చాయి.. హెచ్1బీ వీసాపై ట్రంప్
అలాంటి ఆయన తాజాగా హెచ్ 1బీ వీసాల విషయంపై వైట్ హౌస్ విలేకరి అడిగిన ప్రశ్నకు రోటీన్ కు భిన్నంగా స్పందించారు.
By: Tupaki Desk | 22 Jan 2025 4:33 AM GMTప్రశ్న ఏదైనా సరే.. సూటిగా చెప్పేయటం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అలవాటు. నాన్చటం.. అటూ ఇటూ తేల్చనట్లుగా సమాధానాలు ఇవ్వటం ఆయనకు బొత్తిగా నచ్చదు. తాను అనుకుంటున్నది నిర్మోహమాటంగా చెప్పేయటంతో ఆయనకున్న తెగింపు ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశాధినేతకు లేదనే చెప్పాలి. అలాంటి ఆయన తాజాగా హెచ్ 1బీ వీసాల విషయంపై వైట్ హౌస్ విలేకరి అడిగిన ప్రశ్నకు రోటీన్ కు భిన్నంగా స్పందించారు. వీసాలకు సంబంధించి సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలపై స్పందిస్తూ ఆయన.. తనకు రెండు వైపుల వాదనలు నచ్చినట్లుగా చెప్పారు.
అయితే.. తాను సమర్థవంతులైన వ్యక్తులు అమెరికాలోకి రావటాన్ని ఇష్టపడతానని చెప్పిన ఆయన.. ‘‘కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే నేను మాట్లాడటం లేదు. అన్ని స్థాయిల వ్యక్తులను ద్రష్టిలో పెట్టుకొని ఈ మాట చెబుతున్నా. దేశ వ్యాపారాల్ని విస్తరించటానికి మాకు సమర్థవంతమైన.. నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలి. ఇది హెచ్1బీ వీసాతో సాధ్యమవుతుంది. అందుకే నేను రెండు వాదనల్ని సమర్థిస్తున్నా’ అని పేర్కొన్నారు.
ప్రపంచ కుబేరుడు మస్క్.. భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామిలు చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇస్తుంటే.. ఇతర నేతలు మాత్రం అమెరికా ఫస్ట్ అనే విధానానికి కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలో ట్రంప్ స్పందన ఆసక్తికరంగా మారింది. అర్హత కలిగిన సాంకేతిక నిపుణులు అమెరికాకు వచ్చేందుకు హెచ్1బీ వీసా ఉపయోగపడుతుందని మస్క్.. వివేక్ రామస్వామి పేర్కొనగా.. ఈ అంశంపై అదే పార్టీకి చెందిన నిక్కీ హేలీ మాత్రం భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు.
తాను సౌత్ కరోలినా గవర్నర్ గా పని చేసిన సమయంలో నిరుద్యోగిత రేటును 11 శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గించానని.. విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించినట్లుగా పేర్కొన్నారు. ఈ కారణంతోనే నిరుద్యోగిత తగ్గిందన్నారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వటం వల్ల ఇప్పుడు విమానాలు.. ఆటోమొబైల్స్ తయారీలో రాణిస్తున్నట్లు చెప్పారు. సాంకేతిక రంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తే ముందు విద్యా రంగంపై ఫోకస్ చేయాలన్నారు. అదే సమయంలో అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దని పేర్కొన్నారు.
ప్రత్యేక నిపుణులైన విదేశీల్ని సులువుగా నియమించుకోవటానికి వీలుగా అమెరికన్ కంపెనీలకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అవకాశం కల్పించారు. దీనికి తగ్గట్లు పలు నిబంధనల్లో మార్పులు చేశారు. ఈ వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. ఈ వీసాలతో భారత్.. చైనాలు భారీగా ప్రయోజనం చెందుతునాయి. టెక్నాలజీ కంపెనీలు ఫారిన్ ప్రొఫెషనల్స్ ను ఈ వీసా సాయంతో నియమించుకుంటున్నాయి.