'చైనా పనామా'.. ట్రంప్ తదుపరి పని అదే..
బలగాల అవసరం లేకుండా త్వరలోనే శక్తిమంతమైన చర్య ఉంటుందని హెచ్చరించారు.
By: Tupaki Desk | 3 Feb 2025 7:40 AM GMTమెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల విధింపు అయిపోయింది..జన్మత: అమెరికా పౌరసత్వం రద్దయింది.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం పూర్తయింది.. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో మిగిలిన పని ‘పనామా’ కాల్వ. ఈ మేరకు ఆయన కార్యరంగంలోకి దిగారు. అంతేకాదు.. పనామా కాల్వను చైనా పరోక్షంగా నిర్వహిస్తోందని ఆరోపించారు. ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. అందుకే కాల్వను తిరిగి తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. బలగాల అవసరం లేకుండా త్వరలోనే శక్తిమంతమైన చర్య ఉంటుందని హెచ్చరించారు.
ట్రంప్ ఎన్నికల ప్రచార సమయం నుంచే ఇరుగు పొరుగైన కెనడా, మెక్సికోలను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. సుంకాలు విధిస్తానని గట్టిగా హెచ్చరించారు. ఇక అధికారంలోకి వచ్చాక అదే పని చేస్తున్నారు. శనివారం కెనడా, మెక్సికో, చైనాపై సుంకాలు వేసేశారు. మిగిలింది ‘పనామా కాల్వ’.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆదివారం పనామా అధ్యక్షుడు జోస్‌రౌల్ ములినోతో భేటీ అయ్యారు. పనామాపై చైనా జోక్యాన్ని, నియంత్రణను అడ్డుకోకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, ‘అమెరికా దురాక్రమణకు మేం భయపడం’ అని పనామా అధ్యక్షుడు తెలిపారు. చర్చలకు సిద్ధమని ప్రకటించారు. అయితే, ట్రంప్ హెచ్చరికలతో కాస్త వెనక్కు తగ్గినట్లున్నారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతామని ప్రకటించారు. చైనాతో ఈ ఒప్పందాన్ని 2017లో చేసుకున్నారు. ఇకపై పునరుద్ధరించబోమని వెల్లడించారు.
కాగా, పనామా కాల్వను నిర్మించింది అమెరికానే. అందుకే అంతంగా పట్టుబడుతోంది. 1914లో కట్టింది. పనామా దేశంతో జరిగిన ఒప్పందం మేరకు 1999 డిసెంబరులో పనామాకు ఇచ్చేసింది. కానీ, తమ దేశ వాణిజ్య, నౌకా దళం నుంచి పనామా భారీగా ఫీజులు వసూలు చేస్తోందని.. వీటిని తగ్గించాలని ట్రంప్ కోరుతున్నారు. లేకుంటే పనామా కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. ఇది వివాదం రాజేసింది.