ట్రంప్ బాదుడుపై దిగ్గజ సంస్థలకు కొత్త టెన్షన్
ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చెందిన దిగ్గజ అమెరికన్ సంస్థలు ట్రంప్ తీరును తప్పు పడుతున్నారు.
By: Tupaki Desk | 16 Feb 2025 5:04 AM GMTఅమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఎడా పెడా నిర్ణయాలు తీసేసుకుంటున్న సంగతి తెలిసిందే. జనవరి 20న ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి శత్రుదేశాల మీదనే కాదు మిత్రదేశాల్ని వదిలిపెట్టటం లేదన్న సంగతి తెలిసిందే. అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో ఆయన ప్రదర్శిస్తున్న మహా దూకుడు కారణంగా అమెరికన్ కంపెనీలకు సైతం నష్టం వాటిల్లే ప్రమాదమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నులు భారీగా వేయటానికి వీలుగా ఆదేశాలు జారీ చేసిన ట్రంప్ తీరును తప్పు పడుతున్నారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చెందిన దిగ్గజ అమెరికన్ సంస్థలు ట్రంప్ తీరును తప్పు పడుతున్నారు.
ఇప్పటికే అమెరికా దిగుమతి చేసుకునే పలు వస్తువులపై పన్నులు విధించిన ట్రంప్.. త్వరలో కార్ల దిగుమతులపైనా దిగుమతి పన్నుల మోత పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అమెరికా వినియోగించే కార్లలో 50 శాతం అమెరికాలోనే ఉత్పత్తి చేస్తుండగా.. మరో యాభై శాతం దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో.. ఈ రంగం మీదా పన్నులు బాదటం ద్వారా భారీగా సొమ్ములు వస్తాయన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దేశ ఆదాయాన్ని పెంచటానికి.. వాణిజ్య అసమానతల్ని పరిష్కరించటానికి సుంకాల విధింపు అవసరమంటున్నారు ట్రంప.
అమెరికాకు కార్లను దిగుమతి చేసే దేశాల్లో మెక్సికో.. కెనడా.. జపాన్.. దక్షిణ కొరియా.. జర్మనీ.. బ్రిటన్.. ఇటలీ.. స్వీడన్ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. అమెరికాకు వచ్చే ఉక్కు.. అల్యూమినియం దిగుమతి మీద 25 శాతం సుంకాన్ని విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని దిగ్గజ అమెరికన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ తప్పు పడుతోంది. ఈ తీరు అమెరికాకు ఇబ్బందికరంగా మారుతుందని.. సంస్థల లాభాల మీద ప్రభావం చేపుతుందని వాపోతున్నారు. ఈ ఆందోళనను వ్యక్తం చేస్తున్న అమెరికన్ కంపెనీల్లో ఫోర్డ్.. జనరల్ మోటార్స్.. స్టెల్లాంటిస్ లాంటి కంపెనీలు టెన్షన్ పడుతున్నాయి. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో కార్ల ధరల్ని విపరీతంగా పెంచుతుందని పేరకొన్నారు. తమ సరఫరా ఉత్పత్తుల గొలుసులకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరి.. ట్రంప్ వీరి టెన్షన్ ను పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి.