Begin typing your search above and press return to search.

సుంకాల ఎఫెక్ట్ : అమెరికాకు మాంద్యం ముప్పు.. ట్రంప్ అరికట్టగలడా?

అయితే, ట్రంప్‌ మాత్రం ఈ అంచనాలను ఖండించారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం లేదని, ఇలాంటి ఊహాగానాలను తాను మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   11 March 2025 2:00 AM IST
సుంకాల ఎఫెక్ట్ : అమెరికాకు మాంద్యం ముప్పు.. ట్రంప్ అరికట్టగలడా?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు దేశాలపై సుంకాలను విధించడం ప్రారంభించారు. ఈ విధానంతో వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో ఆర్థిక అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయనీ, దీని ప్రభావంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తొచ్చని భావన వ్యక్తమవుతోంది.

అయితే, ట్రంప్‌ మాత్రం ఈ అంచనాలను ఖండించారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం లేదని, ఇలాంటి ఊహాగానాలను తాను మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు.

ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ తన విధానాన్ని సమర్థించుకున్నారు. ''ఏప్రిల్‌ 2 నుంచి పరస్పర సుంకాల విధింపు అమలులోకి వస్తుంది. ఇతర దేశాలు మనపై ఎంత టారిఫ్‌లు విధిస్తే, మనమూ అంతే విధించబోతున్నాం'' అని తెలిపారు. 2025 నాటికి ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశముందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ''ఇది మార్పుల కాలం. అమెరికాలో సంపదను తిరిగి తీసుకురావడంపై మా దృష్టి ఉంది. మా చర్యలకు సమయం కావాల్సిందే'' అని వివరించారు.

మెక్సికో, కెనడా, చైనాపై భారీ సుంకాలు విధించిన ట్రంప్‌ ఏప్రిల్‌ 2 నుంచి మరిన్ని దేశాలకు కూడా ఈ విధానాన్ని విస్తరించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రభావంతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాన్ని చవిచూడగా, ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వినియోగదారుల ఖర్చులు తగ్గడం, ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కోతలు (లేఆఫ్స్‌) జరగడం ఆర్థిక అనిశ్చితిని మరింత పెంచే పరిస్థితి కనిపిస్తోంది.

నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికా వృద్ధిరేటు 2.4 శాతానికి పడిపోయే అవకాశముంది. మరి ట్రంప్ ఈ ఆర్థిక అల్లకల్లోలాన్ని ఎలా పరిష్కరిస్తాడన్నది వేచిచూడాలి.