Begin typing your search above and press return to search.

అట్టుంటాది ట్రంప్ తోని... కారు రేసులో బీస్ట్... లోపల ప్రెసిడెంట్!

తన సొంత రాష్ట్రమైన ఫ్లోరిడాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలైన "ది డెటోన-500" మోటార్ రేసు ప్రారంభానికి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడి మోటర్ కేడ్ లో వాడే తన కారు "ది బీస్ట్"ను కూడా పంపారు.

By:  Tupaki Desk   |   17 Feb 2025 9:30 AM GMT
అట్టుంటాది ట్రంప్ తోని... కారు రేసులో బీస్ట్... లోపల ప్రెసిడెంట్!
X

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన నిర్ణయాలతో ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ దూకుడు పరిపాలనలోనే కాదు.. మిగిలిన విషయాల్లోనూ చూపిస్తుండటం గమనార్హం. అందుకు తాజా ఉదాహరణ తన సొంత రాష్ట్రమైన ఫ్లోరిడాలో జరిగిన "ది డెటోనా-500" మోటర్ రేసు ప్రారంభ వేడుకల్లో చోటు చేసుకుంది.

అవును... తన సొంత రాష్ట్రమైన ఫ్లోరిడాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలైన "ది డెటోన-500" మోటార్ రేసు ప్రారంభానికి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడి మోటర్ కేడ్ లో వాడే తన కారు "ది బీస్ట్"ను కూడా పంపారు. ఈ సమయంలో అది ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ రెండు ల్యాప్ లను కూడా పూర్తి చేసింది.

ఇక్కడ మరింత ఆసక్తికర విషయం ఏమిటంటే... ఆ సమయంలో ప్రెసిడెంట్ ట్రంప్ తన మనమరాలు కరోలినాతో కలిసి ఆ కారులోనే ఉన్నట్లు వైట్ హౌస్ విడుదల చేసిన వీడియోను బట్టి తెలుస్తోంది.

ట్రంప్ దూకుడు అక్కడితో ఆగలేదు! అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్ కూడా ది డెటోనా-500 మైదానం చుట్టూ ఓ రౌండ్ వేసింది. ఆయనతో పాటు కుమారుడు ఎరిక్, మనవడు లూకె, రవాణా మంత్రి సియాన్ డఫ్టీ, ఇంటీరియర్ సెక్రటర్ డౌగ్ బూర్గమ్ వంటి వారు అందులో ఉన్నారు. ఆ తర్వాత అధ్యక్షుడి కార్ల కాన్వాయ్ రేస్ ట్రాక్ పై రెండు ల్యాప్ లు పూర్తి చేసింది.

ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్... ది డెటోనా-500 రేసు అంటే జీవితంలో వేగం అంటే మక్కువ, ఉప్పొంగించే దూకుడు, రేసింగ్ లోని థ్రిల్ ని ప్రేమించేవారిని ఒక్క చోటుకు చేర్చింది. రేసింగ్ ట్రక్ పై ఇంజిన్ల గర్జన, స్టాండ్లతో ఎగిరే పతకాల వేగం, పవర్, ది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కు ఈ రేసు ఇచ్చే గౌరవం అని తనదైన శైలిలో మాట్లాడారు.

"ది బీస్ట్" ప్రత్యేకతలివే!:

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారే "ది బీస్ట్". 1963లో నాటి అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత అధ్యక్షుడి కారును మరింత సురక్షితంగా తీర్చిదిద్దాలని అమెరికా ప్రభుత్వం భావించి దీన్ని రూపొందించారు. ప్రెసిడెంట్ ఏ దేశానికి వెళ్లినా బీస్ట్ కూడా అక్కడ అడుగుపెట్టాల్సిందే. ఈ కారు అద్దాలన్నీ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ తో చేసినవి.

ఇది గాజు, పాలీకార్బొనేట్ తో ఐదు లేయర్లలో అద్దాలను కలిగి ఉంటుంది. రసాయన, జీవాయుధ దాడులను కూడా ఇవి తట్టుకుంటాయి. టైర్లు కూడా అత్యాధునిక టెక్నాలజీతో తయారుచేశారు. ఇవి పగిలిపోవు.. పంక్చర్ కావు. స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్ తో తయారుచేసిన ఈ కారు బాంబు దాడులను తట్టుకుంటుంది.

ఇదే సమయంలో... డ్రైవర్ క్యాబిన్ లో సరైన కమ్యునికేషన్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. సాదాసీదా డ్రైవర్లు దీన్ని నడపడం కుదరదు. బీస్ట్ డ్రైవర్ కు అమెరికా సీక్రెట్ సర్వీస్ తో ముందుగానే శిక్షణ ఇప్పిస్తారు. ఈ వాహనంలో ప్రెసిడెంట్ చైర్ వద్ద శాటిలైట్ ఫోన్ ఉంటుంది. దీని ద్వారా నేరుగా వైస్ ప్రెసిడెంట్, పెంటగాన్ తో మాట్లాడొచ్చు.