యూఎస్ లో ఆ 3 రోజులు... జనవరి 17-20 భారతీయుల మధ్య ఆసక్తికర చర్చ!
అందులో ఒకటి.. రికార్డ్ స్థాయిలో ఇస్తున్న క్షమాభిక్షలు కాగా.. రెండోది హెచ్-1బీ వీసాల నిబంధనలను సరళీకరిస్తూ తీసుకున్న సంచలన నిర్ణయం.
By: Tupaki Desk | 19 Dec 2024 5:12 PM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తైనప్పటి నుంచీ త్వరలో వైట్ హౌస్ ను ఖాళీ చేయాల్సిన అధ్యక్షుడు బైడెన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో రెండు అత్యంత హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో ఒకటి.. రికార్డ్ స్థాయిలో ఇస్తున్న క్షమాభిక్షలు కాగా.. రెండోది హెచ్-1బీ వీసాల నిబంధనలను సరళీకరిస్తూ తీసుకున్న సంచలన నిర్ణయం.
అవును... మరో కొన్ని వారాల్లో పదవి నుంచి దిగిపోబోతున్న అగ్రరాజ్యం అధినేత జో బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇటీవల హెచ్-1బీ వీసాల నిబంధనలను సవరిస్తూ, సరళీకరిస్తూ తీసుకున్న సంచలన నిర్ణయం, దాని అమలుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
వాస్తవానికి బైడెన్ తీసుకున్న నిర్ణయంపై భారత్, చైనా, బ్రిటన్ పౌరులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారని అంటున్నారు. కారణం... ఇప్పటివరకూ ఉన్న లాటరీ విధానం పోయి, దరఖాస్తు చేసుకున్నవారిలో దాదాపు అందరికీ హెచ్-1బీ వీసాలు దొరికే అవకాశం ఉండటమే! ఇది వలసదారులకు మామూలు గుడ్ న్యూస్ కాదు!
దీనివల్ల అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలని, ఉజ్వల భవిష్యత్తును ఏర్పరచుకోవాలని ఎన్నో కలలు కంటున్నవారికి శుభవార్త అని అంటున్నారు. ఇదే సమయంలో.. స్టూడెంట్స్ వీసా ఎఫ్-1 లను కూడా హెచ్-1బీ వీసాలుగా మర్చుకునే అవకాశం కల్పించారు! ఇవి.. అమెరికా వెళ్లాలనుకుంటున్న ఇతర దేశాల విద్యార్థులను మరింత ఉత్సాహ పరుస్తున్నాయని అంటున్నారు.
ఈ సమయంలో ఈ హెచ్-1బీ వీసాల నిబంధనలను సరళీకరిస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్ ఫైరవుతున్నారు. వివాదాస్పద నిర్ణయాలతో బైడెన్ అమెరికా ప్రతిష్టను దిగజార్చుతున్నారని.. అమెరికా పౌరులకు వెన్నుపోటు పొడుస్తున్నారన్నట్లుగా ట్రంప్ టీమ్ కామెంట్లు చేస్తుందని అంటున్నారు.
అదే సమయంలో... దేశంలో ఇప్పటికే నిరుద్యోగం పెరిగిపోయిందని.. యువత ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని.. అందువల్ల తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హెచ్-1బీ వీసా నిబంధనలను మునుపటికంటే కఠినతరం చేసే దిశగా ఆలోచిస్తామంటూ చెబుతున్నారు. దీంతో... ఈ ఇద్దరి అధినేతల మధ్య విదేశీ విద్యార్థులు, ఉద్యోగార్థులూ నలిగిపోతున్నారని అంటున్నారు!
ఎందుకంటే... బైడెన్ ప్రతిపాదించిన తాజా సరళీకృత నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 17 నుంచి అమల్లోకి రానుండగా.. ఆ తర్వాత మూడు రోజులకు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో.. ఈ మూడు రోజుల్లో ఈ సవరించబడిన నిబంధనల మేర ఏమి జరగబోతుందనేది ప్రధానంగా భారత్ లో ఆసక్తిగా మారిందని అంటున్నారు!