టీవీ చానల్ లో చర్చ సవాల్ చేసిన బైడెన్.. ఓకే చెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అరుదైన సీన్ ఒకటి చోటు చేసుకోనుంది.
By: Tupaki Desk | 16 May 2024 5:52 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అరుదైన సీన్ ఒకటి చోటు చేసుకోనుంది. అమెరికా అధ్యక్ష చరిత్రలో ఈ తరహా3 సవాళ్లను విసురుకున్న దేశాధ్యక్షుడు.. ప్రత్యర్థి మరొకరు ఉండరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు అన్నంతనే యూఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్.. ఇరువురు అభ్యర్థుల మధ్య ఆరోగ్యకరమైన చర్చను నిర్వహిస్తారు. అందులో తమ వాదనలు.. విమర్శలు.. ఆరోపణలతో పాటు.. ప్రత్యర్థులు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. ఈ ఎపిసోడ్ లో ఎవరైతే చురుగ్గా వ్యవహరిస్తారో.. వారికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంటుంది.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈసారి చర్చ సవాల్ ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచే వచ్చింది. అయితే.. దీనికి సంబంధించి గతంలో ఏం జరిగిందన్న అంశాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో పలు మార్లు చర్చకు వచ్చే ధైర్యం ఉందా? అంటూ దేశాధ్యక్షుడిపై సవాలు విసిరే వారు ఆయన రాజకీయ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్. అయితే.. ఆ టైంలో పట్టనట్లుగా ఉండిపోయారు బైడెన్.
అలాంటి ఆయన తాజాగా స్పందిస్తూ.. తాను చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. అంతేకాదు.. 2020లోరెండు చర్చల్లో డొనాల్డ్ ట్రంప్ తన ముందు ఓడారన్న విషయాన్ని ప్రస్తావించారు. ‘‘గతంలో జరిగిన రెండు చర్చల్లో ట్రంప్ ఓడారు. అప్పటినుంచి ఆయన చర్చకు రాలేదు. ఇప్పుడు మాత్రం చర్చకు సిద్ధమంటున్నారు. అలాగే కానివ్వండి.. డేట్స్ ఫిక్స్ చేయండి.. బుధవారాల్లో ట్రంప్ ఖాళీ ఉంటుందని తెలిసింది. కేవలం ఒకటి కాకుండా రెండింటిలోనూ చర్చ పెట్టేలా చూడండి’’ అంటూ బైడెన్ రియాక్టు అయ్యారు.
ఆయన రియాక్షన్ మీద ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. బైడెన్ సవాల్ మీద స్పందించారు. తాను ఎంతో కాలంగా బైడెన్ తో చర్చ పెట్టాలని కోరిన వైనాల్ని గుర్తు చేశారు. అధ్యక్షుల వారిపై గర్జించేందుకు తాను సిద్ధమంటూ తన సొంత సోషల్ మీడియా నెట్ వర్కు ‘‘ట్రూత్’’ సాక్షిగా పోస్టు పెట్టారు. జూన్.. సెప్టెంబరులో ప్రతిపాదించిన రెండు చర్చకు సిద్దమన్న ట్రంప్ మాటతో అమెరికా అధ్యక్ష ఎన్నికలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.