ట్రంప్ వర్సెస్ కమల: 5 కీలక అంశాల్లో వారి వాదనలివే!
యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజు రోజుకు దగ్గరపడుతున్నాయి.
By: Tupaki Desk | 19 Aug 2024 4:15 AM GMTయావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజు రోజుకు దగ్గరపడుతున్నాయి. వచ్చే నెలలో జరిగే ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటమేకాదు.. వివిధ అంశాల మీద తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు అంటే.. ఒక్క అమెరికాకు మాత్రమే కాదు.. ఎవరు అవునన్నా.. కాదన్నా ప్రపంచానికి పెద్దన్నకు బిగ్ బాస్ లాంటోడు.
మరి.. అంతటి కీలక స్థానానికి పోటీ పడుతున్న ఈ ఇద్దరు అభ్యర్థులు (ట్రంప్, కమలా హారిస్) వివిధ అంశాల మీద తమ స్టాండ్ ను స్పష్టం చేస్తున్నారు. అన్ని కాకున్నా.. కీలకమైన 5 అంశాల మీద వీరిద్దరి వాదనలు ఏమిటి? తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న విషయంతో పాటు.. సదరు అంశాల్ని వీరిద్దరు ఎలా చూస్తున్నారన్నది చూస్తే.. ఎవరి వైఖరి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది.
వాతావరణ మార్పులు - ఇంథనంపై..
కమలా హారిస్: హరిత ఇంధనం వైపు మొగ్గు చూపటంతో పాటు.. సముద్ర గర్భంలో చమురు వెలికితీతను వ్యతిరేకించారు. విదయుత్ వినియోగం ఆదాతో పాటు.. పర్యావరణ అనుకూల పథకాలకు ప్రోత్సాహం. కర్బన్ ఉద్గారాల విడుదల తగ్గింపునకు ప్రయత్నం చేస్తున్నారు. దీని మీదా ఫోకస్ చేయనున్నారు.
ట్రంప్: వాతావరణ మార్పులపై పెద్దగా ధ్యాస లేదు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగారు (బైడెన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిస్ ఒప్పందంలోకి అమెరికా చేరింది). విచ్చలవిడిగా చమురు తవ్వాలకు ఓకే చెప్పేశారు. మళ్లీ గెలిస్తే పారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తామని స్పష్టత.
ఇజ్రాయెల్ - ఉక్రెయిన్ ఉదంతాలపై
కమలా హారిస్: ఇజ్రాయెల్ దాడుల్ని సమర్థిస్తూనే.. పాలస్తీనియన్ల ప్రాణాలు ముఖ్యం. త్వరగా యుద్ధాన్ని ముగించాలంటూ ఇజ్రాయెల్ ప్రధానిని కోరటం. కాల్పుల విరమణ ఒప్పందానికి.. సంధికి మొగ్గు చూపటం. ఈజిప్టు.. ఖతార్ లతో కలిసి మధ్యవర్తిత్వానికి ఓటు. ఎన్నికల్లో విజయం సాధిస్తే యుద్ధం త్వరగా ముగిసే వీలు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ట్రంప్: హమస్ అంతమయ్యే వరకు ఇజ్రాయెల్ కు మద్దతు. మరింత మారణహోమం జరక్కుండా త్వరగా యుద్ధాన్ని ముగించి గాజాలో శాంతి స్థాపనకు మొగ్గు. జనావాసాలపై ఇజ్రాయెల్ దాడుల ఖండన. ఉక్రెయిన్ - రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించే సత్తా తనకుందన్న ప్రకటన.
పాలనపై..
కమలాహారిస్: ప్రభుత్వ ఉద్యోగుల్ని హటాత్తుగా తొలగించే ప్రాజెక్టు 2025 సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకం. ప్రభుత్వ ఉద్యోగుల్ని సులువుగా తీసేసేలా ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకం. సిబ్బంది ఉద్యోగ భద్రతకు హామీ. అక్రమ వలసల్నితగ్గింపుపై ఫోకస్. ఆహార ఉత్పత్తి ధరల తగ్గింపునకు ప్రయత్నం కార్మికుల టిప్ పై పన్ను తొలగింపు. కార్మికుల కనీస వేతనాల పెంపు. పౌరులు కొనే ఆధునాత ఆయుధాలపై నిషేధం.
ట్రంప్: తాను అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన ప్రాజెక్టు 2025పై మౌనం. తనపై పలు కేసులకు కారణమైన న్యాయశాఖ సిబ్బందిపై వేటు. విద్యాశాఖ రద్దు. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ సంస్థల ప్రక్షాళన.
అబార్షన్..
కమలా హారిస్: చట్టబద్ధమైన అబార్షన్ కు మద్దతు. తమ ప్రత్యర్థి రిపబ్లిక్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అబార్షన్లపై నిషేధం విధించటం తప్పన్న వాదన. అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే.. చట్టబద్ధమైన అబార్షన్ కు అనుమతిస్తూ పార్లమెంట్ లో చట్టాన్ని తెచ్చే ప్రయత్నం.
ట్రంప్: అబార్షన్ పై కొన్ని రాష్ట్రాల్లో నిషేధం అమలవుతుంటే.. కొన్ని రాష్ట్రాల్లో షరతులతో అనుమతి. అబార్షన్ పై స్పందించకుండా మౌనం. అబార్షన్ పై జాతీయ విధానంపై మాట్లాడని వైనం. ఈ అంశాన్ని రాష్ట్రాలకే వదిలేస్తేనే మంచిదన్న భావన.
చట్టాల అమలుపై..
కమలా హారిస్: ఎన్నికల్లో గెలిస్తే ట్రంప్ పై కేసులు పెట్టే అవకాశం. గత అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని తప్పు పడుతూ పార్లమెంట్ భవనంపై రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు.. మద్దతుదారులను ట్రంప్ ఉసిగొలప్పటం.. లాంటి వాటిని తప్పపట్టటం. ట్రంప్ పై ఉన్న పలు కేసుల్లో తీర్పులు త్వరగా వచ్చేలా ఒత్తిడి చేసే అవకాశం. ప్రజాస్వామ్య పాలనకు కట్టుబడి ఉంటానంటూ వ్యాఖ్యలు.
ట్రంప్: బైడెన్ చేతిలో ఓటమిని అంగీకరించనట్లే.. ఈసారి ఎన్నికల్లో ఓడినా తన ఓటమిని ఒప్పుకోరు. నాటి పార్లమెంట్ పై దాడి.. అక్కడి పోలీసుల్ని గాయపరిచిన నిందితులకు క్షమాభిక్ష. ఎఫ్ బీఐ ప్రక్షాళన. బైడెన్ పాలనలో అవినీతిపై ప్రత్యేక ప్రాసిక్యూటర్ తో విచారణకు హామీ.