Begin typing your search above and press return to search.

ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన ట్రంప్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భావోద్వేగంగా ప్రసంగించారు.

By:  Tupaki Desk   |   19 July 2024 12:30 PM GMT
ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన ట్రంప్!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భావోద్వేగంగా ప్రసంగించారు. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సు చివరి రోజున మూడోసారి పార్టీ తరఫు అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరించిన ట్రంప్.. ఈ సందర్భంగా తీవ్రమైన భావోద్వేగంతో మాట్లాడారు. అమెరికా కాలమానం ప్రకారం గత శనివారం పెన్సిల్వేనియాలో తనపై జరిగిన హత్యాయత్నం తర్వాత ఆయన మొదటిసారి మాట్లాడారు.

తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత అమెరికా ప్రజలు తనపై కురిపిస్తున్న ప్రేమ.. మద్దతుకు థ్యాంక్స్ చెప్పిన ట్రంప్.. ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పం ఏ మాత్రం విచ్ఛిన్నం కాబోదన్నారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాన్ని అందించటానికి తాను కట్టుబడి ఉన్నట్లుగా చెప్పిన ట్రంప్.. తన తీరుకు కాస్త భిన్నంగా ఎమోషనల్ గా మాట్లాడారు. విశ్వాసం.. బలం.. ఆశతో కూడిన సందేశంతో అమెరికన్ల ముందు తాను నిలబడినట్లుగా ప్రసంగాన్నిప్రారంభించిన ట్రంప్.. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉండేందుకు తాను భక్తితో.. గర్వంతో అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. తన ప్రయాణంలో తన సతీమణి మెలనియా అండగా ఉందన్న ఆయన ఆమెకు థ్యాంక్స్ చెప్పారు.

తన ప్రాణం తీసేందుకు హంతకుడి బుల్లెట్ ఎంత దగ్గరగా వచ్చిందో అందరికి తెలిసిందేనన్న ట్రంప్.. చాలా మంది ఆ రోజున ఏం జరిగందని అడుగుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘‘ఈ సమయంలో ఆ రోజు ఏం జరిగిందో మీకు చెప్పాలనుకుంటున్నా. దీన్ని మరోసారి నా నుంచి మీరు వినలేరు. ఎందుకుంటే.. దాన్ని తలుచుకోవటానికే భయంగా ఉంది. ఇంత హేయమైన దాడి జరిగినప్పటికి.. గతం కంటే బలంగా.. నిశ్చయంగా మనమంతా ఈ రోజు ఇక్కడ ఏమయ్యాం. మన సంకల్పం విచ్ఛిన్నం కాలేదు. ఉద్దేశం మారలేదు. అమెరికన్ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నా. నేను ఇవ్వాల్సినవన్నీ నా మనసుతో ఇస్తా. శక్తి మేర పోరాడతానని మాట ఇస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.

బుల్లెట్ సరిగ్గా దగ్గరకు వచ్చిన సమయంలో తాను తల తిప్పానని.. ఏ మాత్రం పొరపాటు జరిగినా తానీ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదన్న ట్రంప్.. ‘‘ఈ రోజు నేను మీ ముందు నిలబడి ఉండేవాడిని కాదు. ఆ రోజు వలసదారులకు సంబంధించిన సమాచారం చూడటం కోసం పేపర్ వైపు చూశా. అందుకే బుల్లెట్ సరిగా దగ్గరకు వచ్చిన సమయంలో తల తిప్పా. అలా జరగకపోయి ఉంటే దుండగుడు కాల్చిన బుల్లెట్ లక్ష్యాన్ని చేరుకునేది. నేను మీ ఎదుట నిలబడి ఉండేవాడిని కాదు. దేవుడు నా వైపు ఉన్నాడు. ఆయన ఆశీస్సులే కాపాడాయి. ఆ క్షణంలో దేవుడే నా మరణాన్ని అడ్డుకున్నాడు’’ అని ఎమోషన్ అయ్యారు.