సొంత పార్టీ మహిళా నేతపై ఇవేం వ్యాఖ్యలు ట్రంప్?
ఆయన సొంత పార్టీ (రిపబ్లికన్లు) ప్రత్యర్థులు ఆయనతో పోటీ పడుతున్న వేళ.. వారిపై నిర్దాక్షిణ్యంగా వ్యాఖ్యలు చేసేందుకు వెనుకాడటం లేదు.
By: Tupaki Desk | 12 Feb 2024 2:30 AM GMTఎవరేం అనుకున్నా ఫర్లేదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ మాటల తీరుతోనే బోలెడన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన తీరులో మార్పు రాలేదు. మరోసారి అమెరికాకు దేశాధ్యక్షుడు కావాలన్న పట్టుదలతో ఉన్న ఆయన.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన సొంత పార్టీ (రిపబ్లికన్లు) ప్రత్యర్థులు ఆయనతో పోటీ పడుతున్న వేళ.. వారిపై నిర్దాక్షిణ్యంగా వ్యాఖ్యలు చేసేందుకు వెనుకాడటం లేదు. పోటీ బరిలో ఉన్న మహిళా ప్రత్యర్థి.. భారత మూలాలు ఉన్న నిక్కీ హేలీపై ఆయన మాటలు విసిరారు.
నెవడా స్టేట్ లో ట్రంప్ నకు ఆమె గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే.. ఆమె ఆ రాష్ట్రంలో పోటీకి దూరంగా ఉండటంతో ట్రంప్ విజయం సాధించారు. ఇలాంటివేళ.. నిక్కీ హేలీ భర్తపై ట్రంప్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో నిక్కీ హేలీ భర్త కనిపించటం లేదు? ఆయన ఎక్కడ? ఆయనకు ఏమైంది? లాంటి ప్రశ్నలు వేస్తూ విమర్శలు చేశారు. దీనిపై తాజాగా నిక్కీ హేలీ రియాక్టు అయ్యారు. ట్రంప్ ను ఉద్దేశించి కాసింత ఘాటుగా స్పందించారు. ఇలాంటి ప్రశ్నలు ముఖాముఖి డిబేట్ సమయంలో అడిగితే బాగుంటుందని.. అంతే తప్పించి లేనప్పుడు ఇలాంటి విమర్శలేంటి? అంటూ మండిపడ్డారు.
ఆయనకు ఏదైనా అనిపిస్తే సూటిగా చెప్పాలే తప్పించి వెనుకాల విమర్శలు చేయొద్దన్న నిక్కీ హేలీ.. స్టేజ్ మీదకు వచ్చి తనతో డిబేట్ లో మాట్లాడాలన్నారు. తన భర్త దేశానికి సేవలు అందించారన్న నిక్కీ హేలీ.. ‘దాని గురించి నీకు ఏం తెలీదు. మైకేల్ సేవల గురించి నేను గర్విస్తున్నా. ప్రతి మిలిటరీ ఫ్యామిలీకి తెలుసు అందులో పని చేసిన వారి త్యాగం గురించి. మిలిటరీ బలగాల త్యాగం గురించి తెలియని వారు అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ గా వ్యవహరించే అర్హత ట్రంప్ నకు లేదన్నారు.
మిలిటరీ బలగాల త్యాగాలను కించపరిచే ట్రంప్.. మిలిటరీ డ్రైవర్ లైసెన్సు పొందటానికి కూడా అర్హుడు కాదంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే.. తనపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు నిక్కీ హేలీ భర్త సైతం రియాక్టు అయ్యారు. సోషల్ మీడియాలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఇదే మనుషులకు.. జంతువులకు మధ్యనున్న తేడా’’ అంటూ అనాల్సిన మాటను సూటిగా అనేయటమే కాదు.. జంతువులు ఎప్పుడు మూగ జంతువుకు నాయకత్వం వహించటానికి అనుమతించవని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మాట అనటం ఎందుకు? అంతకు రెట్టింపు మాటలు అనిపించుకోవటం ఎందుకు? అన్న భావన ట్రంప్ తీరును చూస్తే అర్థం కాక మానదు.