ఆ విదేశీ విద్యార్థులు స్వదేశాలకే... ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంతో హోరెత్తించేస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 28 May 2024 9:21 AM GMTఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంతో హోరెత్తించేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ ఈసారి అధికారంలోకి వస్తే విదేశీ విద్యార్థూలకు బ్యాడ్ టైం స్టార్ట్ అనే చర్చలూ నడుస్తున్న పరిస్థితి. ఈ సమయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే విదేశీయుల విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయనే చర్చ నిత్యం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలను చేపట్టిన విదేశీ విద్యార్థులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని స్వదేశాలకు పంపించేస్తానని అన్నారు.
తాజాగా న్యూయార్క్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దాతలతో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే... ఏ విద్యార్థి అయినా దేశంలో ఆందోళనలు చేస్తే.. వారిని అమెరికా బయటకు సాగనంపుతామని తెలిపారు. ప్రధానంగా పాలస్తీనాకు మద్దతుగా జరిగిన ఆందోళనల్లో చాలా మంది విదేశీ విద్యార్థులున్నారని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా అతి త్వరలోనే వారు తమ ప్రవర్తనకు మూల్యం చెల్లించుకొంటున్నారని తెలిపారు. ఆ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, ప్రొఫెసర్లు కూడా ఏదో ఒక రోజు అమెరికాలో రాజ్యాంగ పదవులు చేపట్టవచ్చని ఓ దాత ఆందోళన వ్యక్తం చేశాడు. దీనికి ట్రంప్ స్పందిస్తూ నిరసనలను అణచివేస్తానని పేర్కొన్నారు. ఇదే సమయంలో గాజా యుద్ధం విషయంలో ట్రంప్ ఇజ్రాయెల్ కు మద్దతుగా మాట్లాడారు.
ఇదే క్రమంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆందోళనలను అణచివేసిన పోలీస్ డిపార్ట్ మెంట్ నూ ట్రంప్ అభినందించారు. ఈ సందర్భంగా తనను ఎన్నుకొంటే 25-30 ఏళ్ల నాటి పరిస్థితిని మళ్లీ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాగా... ఏప్రిల్ లో అమెరికాలోని పలు యూనివర్శిటీల్లో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే.