6ని 1కి తగ్గించిన కమలా హరీస్ ఎంట్రీ.. సరికొత్త సర్వే ఫలితాలు!
అంతకంటే ముందు.. జరిగిన డిబేట్స్ లో బైడెన్ కాస్త తడబడ్డారని, ట్రంప్ మాత్రం కాన్ఫిడెంట్ గా మాట్లాడరనే చర్చా జరిగింది.
By: Tupaki Desk | 28 July 2024 4:57 AM GMTనిన్నమొన్నటి వరకూ.. ప్రధానంగా ట్రంప్ పై కాల్పుల ఘటన అనంతరం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి వార్ వన్ సైడ్ అయ్యేట్లుగా ఉన్నాయని.. ఆ కాల్పుల ఘటన అనంతరం ట్రంప్ గెలువు అవకాశాలు భారీగా పెరిగాయనే కామెంట్లు వినిపించాయి. అంతకంటే ముందు.. జరిగిన డిబేట్స్ లో బైడెన్ కాస్త తడబడ్డారని, ట్రంప్ మాత్రం కాన్ఫిడెంట్ గా మాట్లాడరనే చర్చా జరిగింది.
దీంతో... ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ దే పై చేయి అనే విషయం సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. దీనికి తోడు కార్పొరేట్ సంస్థలు కూడా ట్రంప్ కు ఆర్థిక సహకారం అందించడం కూడా ఈ భరోసాలకు బలం చేకూర్చింది. అయితే... ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న కమలా హరీస్ వచ్చాక లెక్కలు మారుతున్నాయని అంటున్నారు.
అవును... యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో డెమోక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న కమలా హారిస్ కు రోజు రోజుకీ మద్దతు పెరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో వాటిని బలపరిచే విషయం తాజాగా తెరపైకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఇందులో భాగంగా... తాజాగా వెలువడిన న్యూయార్ టైమ్స్, సియానా కాలేజ్ సంయిక్తంగా నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
ఇందులో భాగంగా... బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నప్పుడు డెమోక్రటిక్స్ పార్టీకీ – రిపబ్లికన్ పార్టీ మధ్య ఉన్న ఓట్ల తేడా 6 శాతం కాగా.. బైడెన్ స్థానంలో కమలా హారిస్ ఎంట్రీ తర్వాత ఆ తేడా 1 శాతానికి తగ్గిపోయింది. బైడెన్ వైదొలగిన తర్వాత నిర్వహించిన ఈ సర్వే శనివారం విడుదలైంది.. ఈ ఫలితం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశం అవుతోంది.
ఈ తాజా సర్వేలో అమెరికా ఓటర్లలో 48 శాతం మంది ట్రంప్ కు మద్దతు ఇవ్వగా.. హారిస్ కు 47 శాతం మంది అండగా నిలిచారు. అంటే... ఒక్క శాతం తేడా మాత్రమే ఇద్దరి మధ్యా ఉందన్నమాట. బైడెన్ హయాంలో ఈ తేడా 6 శాతంగా ఉండేది. ఇక రిజిస్టర్డ్ ఓటర్లలో ట్రంప్ కు 48 శాతం, హారిస్ కు 46 శాతం మద్దతు లభించింది. బైడెన్ అభ్యర్థిగా ఉన్న సమయంలో ఈ తేడా 9 గా ఉండగా.. ఇప్పుడు 2 శాతంగా ఉంది!
మరోపక్క కమలా హారిస్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే అతివాద అధ్యక్షురాలిగా చరిత్రలో మిగిలిపోతారని ట్రంప్ విమర్శించారు. ఆమె ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయారని అంటూనే.. దేశ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను సక్రమంగా నిర్వహించని హారీస్... ఎంతోమంది అక్రమంగా అమెరికాలోకి వలస వస్తున్నా అడ్డుకోలేక విఫలమయ్యారని ధ్వజమెత్తారు!