Begin typing your search above and press return to search.

ట్రంప్ రెండోసారి అధ్యక్ష కలకు తొలి విజయం!

వరుస ఎదురుదెబ్బల వేళ.. ట్రంప్ కు మొదటి విజయం దక్కిందని చెప్పొచ్చు. అయోవాలో సోమవారం జరిగిన పోలింగ్ లో ట్రంప్ మెజార్టీ ఓట్లు సంపాదించారు.

By:  Tupaki Desk   |   16 Jan 2024 5:15 AM GMT
ట్రంప్ రెండోసారి అధ్యక్ష కలకు తొలి విజయం!
X

విమర్శల్ని లెక్క చేయరు. ఆరోపణల్ని పట్టించుకోరు. ఎదురుదెబ్బల్ని లైట్ తీసుకుంటూ.. తాను గురి పెట్టిన లక్ష్యం దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైన ట్రంప్ కు ఇప్పటికే పలుమార్లు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. పట్టువిడవని విక్రమార్కుడి మాదిరి వ్యవహరిస్తున్న ఆయన.. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవటానికి వీలుగా చేస్తున్న ప్రయత్నాలకు ఒక విజయం సొంతమైంది. అధ్యక్ష రేసులో ఉన్న ఆయన.. తన కలను సాకారం చేసుకోవటానికి తాజా విజయం ఒక పెద్ద అడుగుగా అభివర్ణిస్తున్నారు.

వరుస ఎదురుదెబ్బల వేళ.. ట్రంప్ కు మొదటి విజయం దక్కిందని చెప్పొచ్చు. అయోవాలో సోమవారం జరిగిన పోలింగ్ లో ట్రంప్ మెజార్టీ ఓట్లు సంపాదించారు. సొంత పార్టీకి చెందిన తన ప్రత్యర్థులైన నిక్కీ హైలీ.. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ లను వెనక్కి నెట్టి ట్రంప్ ముందు వరుసకు చేరుకున్నారు. అయోవాలో జరిగిన పోలింగ్ లో భారీ ఎత్తున ఓటర్లు పాల్గొన్నారు. 1600 పోలింగ్ కేంద్రాల్లోని ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అయోవాలో తన గెలుపు మీద ట్రంప్ ధీమాను వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్లే తాజా ఫలితాలు ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ ఫలితం ట్రంప్ అధ్యక్ష కలకు శుభసూచకంగా అభివర్ణిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడ్ని ఎన్నుకునే ప్రక్రియలో అయోవాకు 2 శాతం కంటే తక్కువ ఓటింగ్ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్ పైనే ఆయన విజయం ఆధారపడి ఉంటుంది. అయితే.. తాజా విజయం ఆయనకు స్థైర్యాన్ని ఇవ్వటంతో పాటు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పాలి. రెండోసారి అధ్యక్ష కలను నెరవేర్చుకోవాలంటే.. న్యూహాంప్ షైర్.. నెవాడా.. సౌత్ కరోలినాలో ట్రంప్ కు తప్పనిసరిగా విజయం అవసరం. మరి.. ఆయా ప్రాంతాల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.