ఆమె అడ్డాలో దూసుకెళుతున్న ట్రంప్
తాజాగా అధ్యక్ష రేసులో ఉండేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ అమెరికన్ నేత నిక్కీ హేలీ సొంత రాష్ట్రంలో ట్రంప్ అధిక్యతను ప్రదర్శించటం ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 2 Nov 2023 4:37 AM GMTఏది ఏమైనా మరోసారి అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరించాలన్న పట్టుదలతో ఉన్న డొనాల్డ్ ట్రంప్.. అందుకు తగ్గట్లే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన అడుగులు వేస్తున్నారు. ఫైనల్ గా ఎన్నికల రేసులోకి వెళ్లటానికి ముందుగా.. సొంత పార్టీలో అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారిలో అధిక్యతను ప్రదర్శించేందుకు వీలుగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
తాజాగా అధ్యక్ష రేసులో ఉండేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ అమెరికన్ నేత నిక్కీ హేలీ సొంత రాష్ట్రంలో ట్రంప్ అధిక్యతను ప్రదర్శించటం ఆసక్తికరంగా మారింది. హేలీ సొంత రాష్ట్రం దక్షిణ కరోలినా. ఈ రాష్ట్రంలో తాజాగా సేకరించిన అభిప్రాయసేకరణలో నిక్కీ హేలీ కంటే ట్రంప్ స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించటం గమనార్హం. సీఎన్ ఎన్ తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది ట్రంప్ కు తమ మద్దతు తెలిపితే.. నిక్కీ హేలీకి మాత్రం 22 శాతం మందే బాసటగా నిలిచారు. అధ్యక్ష రేసులో ఉన్న మరో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామికి ఒక్క శాతం మందే మద్దతుగా నిలవటం కనిపించింది.
ప్రైమరీల ఎన్నికల ముందు జరిగే రాష్ట్రాల్లో దక్షిణ కరోలినా ఉంది. ఈ రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో.. తాము తిరిగి ట్రంప్ కు మద్దతు ఇస్తామని ఆయన మద్దతుదారుల్లో 82 శాతం మంది చెప్పగా.. హేలీ విషయంలో మాత్రం 42 శాతమే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. అమెరికా మొత్తంలో ఎవరికి ఎంత మద్దతు ఉందన్న విషయానికి వస్తే.. రిపబ్లికన్లలో 59 శాతం మంది ట్రంప్ పక్షాన ఉన్నట్లుగా తేలింది. రేసులో ఉన్న డిశాంటిస్ కు 12.6శాతం.. నిక్కీ హేలీకి 8.3 శాతం.. రామస్వామికి 4.6 శాతం మంది మద్దతు ఇస్తున్నట్లుగా ‘రియల్ క్లియర్ పాలిటిక్స్’ అంచనా వేశాయి.