డొనాల్డ్ ట్రంప్ అను నేను...
ఇక ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.
By: Tupaki Desk | 20 Jan 2025 4:29 PM GMTఅమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న 78 ఏళ్ల ట్రంప్ పాలనపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆయన అనుసరించబోయే విధానాల వల్ల పలు దేశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నవంబరులో ఎన్నికల ఫలితాలు వచ్చిన నుంచి ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు పలు దేశాల్లో ఆందోళన నెలకొంది. కెనడాను అమెరికాకు 51వ రాష్ట్రంగా అభివర్ణించిన ట్రంప్.. గ్రీన్ ల్యాండును కలిపేసుకుంటామని చేసిన ప్రకటన చర్చకు దారితీసింది. ఇక ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.
రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న ట్రంప్ నాలుగేళ్ల ఈ పదవిలో ఉంటారు. 2020లో తన ఓటమిని అంగీకరించని ట్రంప్.. తన మద్దతుదారులతో క్యాపిటల్ హిల్ పై దాడి చేయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా హ్యాష్ మనీ కేసులో నేరస్థుడిగా ముద్రపడిన తొలి అధ్యక్షుడిగా రికార్డు నెలకొల్పనున్నారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైన నుంచి మూడోసారి ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి అధ్యక్షుడిగా గెలిచినంత వరకు మొండివాడిగా పేరు తెచ్చుకున్నారు. అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతంతో ఆయనను ఎక్కువ మంది ఇష్టపడతారని అంటారు. 2020లో వైట్ హౌసును వదిలిన తర్వాత ట్రంప్ ను ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా ఆయన మద్దతుదారులు మాత్రం వెనక్కి తగ్గలేదు.
ఇక ఈ ఎన్నికల ప్రచారంలో పెన్సిల్వేనియాలో దుండగుడి కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్న ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని దూకుడుగా కొనసాగించారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నోసార్లు దాడుల నుంచి తప్పించుకున్న ట్రంప్ తనను ఎవరూ ఆపలేరనట్లు దూసుకుపోయారు. ఇక తాను గెలిస్తే అమెరికాను మళ్లీ గొప్పగా మారుస్తానని, మెక్సికో సరిహద్దుల్లో కంచె నిర్మించి వలసలకు బ్రేక్ వేస్తానని హామీలిచ్చారు. అదేవిధంగా రష్యా-ఉక్రెయిన్, గాజా వార్ పైనా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఈ రెండు యుద్ధాలు ఆగిపోయే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఇక ట్రంప్ అధ్యక్షుడయ్యాక మన దేశంతో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో మన పన్ను విధానంపై తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్. భారత్ టారిఫ్ కింగ్ అంటూ అభివర్ణించారు. అదేవిధంగా తాజాగా అధ్యక్షుడయ్యాక కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారత్, బ్రెజిల్ వంటి దేశాలు అత్యధికంగా పన్నులు వేస్తున్నాయని, దేనికైనా ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. వారు మాపై పన్నులు వేస్తే మేమూ అదే స్థాయిలో పన్నులు విధిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలు దేశ పారిశ్రామిక రంగాన్ని భయపెడుతున్నాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడుగా ఉండగా, అమెరికా-భారత్ సంబంధాలు బలపడ్డాయి. అయితే ఇప్పుడు ఇరుదేశాల మధ్య పన్నుల విషయంలో ఘర్షణ చోటుచేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై ఇరు దేశాల ప్రభుత్వాలు ఎలాంటి ధోరణి అనుసరిస్తాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
అదేవిధంగా ట్రంప్ హెచ్1బీ వీసాలపై గతంలో తీవ్ర విమర్శలు గుప్పించిన ట్రంప్, తాజాగా తన విధానం మార్చుకున్నారు. విమర్శలు బదులు అదో గొప్ప కార్యక్రమం అంటూ కీర్తించడం మొదలుపెట్టారు. హెచ్1బీ వీసా విధానాన్ని సమర్థించే ఈలన్ మస్క్, వివేక్ రామస్వామి ఈ సారి ట్రంప్ జట్టులో కీలకంగా ఉండటం వల్లే ఆయనలో ఈ మార్పు వచ్చిందని అంటున్నారు. అయితే ట్రంప్ ఆలోచన మారడం వల్ల అమెరికాకు వెళ్లాలనుకుంటున్న, అక్కడే స్థిరపడాలని అనుకుంటున్న భారతీయులకు ఊరట దక్కిందంటున్నారు.
మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ 2.0 పాలనపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడంటే ఆ ఒక్క దేశానికే కాదు. ఆయన ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉండటంతో షేర్ మార్కెట్ నుంచి బులియన్ మార్కెట్ వరకు ట్రంప్ తొలి ప్రసంగం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.