Begin typing your search above and press return to search.

ట్రంప్ విషయంలో వివేక్‌ వ్యూహాత్మక అడుగులు... ఎక్కడ తగ్గాలో తెలుసా?

ఈ కార్యక్రమంలో మైకందుకున్న రామస్వామి... "21 శాతబ్దంలో ట్రంప్‌ అత్యుత్తమ ప్రెసిడెంట్‌" అని పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 7:34 AM GMT
ట్రంప్  విషయంలో వివేక్‌   వ్యూహాత్మక అడుగులు... ఎక్కడ తగ్గాలో తెలుసా?
X

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో... భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలన్నట్లుగా ముందుకు కదులుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా డొనాల్డ్ ట్రంప్ అభిమానం చూడగొన్నారు!

ఇందులో భాగంగా ఇటీవల ఆగస్టు 23వ తేదీన జరిగిన రిపబ్లికన్‌ పార్టీ తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ లో వివేక్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ డిబేట్ లో డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొనలేదు. ఈ చర్చా కార్యక్రమంలో వివేక్‌ రామస్వామితో పాటు నిక్కీ హేలీ తదితర ఆశావహులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మైకందుకున్న రామస్వామి... "21 శాతబ్దంలో ట్రంప్‌ అత్యుత్తమ ప్రెసిడెంట్‌" అని పేర్కొన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో ఆయన ట్రంప్‌ ను బలంగా సమర్థించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోపణల్లో ట్రంప్‌ నకు శిక్షపడితే ఆయన పక్షాన ఎవరుంటారు? అనే ప్రశ్నకు ఏమాత్రం సంకోచించకుండా వివేక్‌ చెయ్యి పైకెత్తారు.

అక్కడితో ఆగని ఆయన.. "ఏదో ఒక రోజు మీరు కూడా ట్రంప్‌ ను కచ్చితంగా క్షమిస్తారని నమ్మితే నా పక్షాన చేరండి" అని కోరాడు. మొత్తంమీద ఈ చర్చా కార్యక్రమంలో రామస్వామి విజయం సాధించినట్లు అమెరికాలో పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అయితే తాజాగా ఈ కార్యక్రమంపై ట్రంప్‌ స్పందించారు. ఇందులో భాగంగా తన అభిప్రాయం వెల్లడిస్తూ.. "డిబేట్‌ లో వివేక్‌ రామస్వామి నిజాయతీ కారణంగా భారీ విజయం సాధించినట్లు నేను భావిస్తున్నాను. థాంక్యూ వివేక్‌" అని ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ లో పేర్కొన్నారు.

కాగా... రిపబ్లికన్‌ పార్టీలో ఇప్పటికీ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ నకే భారీ మద్దతు లభిస్తోంది. ఆయనతో పోటీ పడటానికి ప్రయత్నిస్తూనే... ఒకవేళ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైతే తాను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండటానికి సిద్ధమవుతున్నట్లు రామస్వామి మాటలను బట్టి తెలుస్తోంది.

దీంతో... ఒక వేళ ట్రంప్‌ ఎన్నికల రేసు నుంచి వైదొలగాల్సి వస్తే తనకు ఆయన మద్దతు లభించేలా రామస్వామి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.