Begin typing your search above and press return to search.

అనంత రాజకీయం వేడెక్కేలా కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తనను కుట్రలు చేస్తున్నారన్న ఆయన.. తనకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందన్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

By:  Tupaki Desk   |   12 Oct 2024 4:09 AM GMT
అనంత రాజకీయం వేడెక్కేలా కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తనను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అందుకు పోలీసులు సైతం సహకరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన ఆరోపణలు సంచనలంగా మారటమే కాదు.. రాజకీయంగా కొత్త దుమారానికి తెర తీసినట్లైంది. తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కుట్రలు చేస్తున్నారన్న ఆయన.. తనకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందన్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

"టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది. ఎస్పీ జగదీష్ సహకరాంతో జేసీ నన్ను చంపేందుకు కుట్రలు చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ నుంచి ఇప్పటివరకు పలుమార్లు చంపేందుకు జేసీ ప్రయత్నించారు. తన సోదరుడు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని 2006లో చంపారు. ఇప్పుడు అదే పద్దతిని ఫాలో అయి.. నన్ను హతమార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. జేసీ గూండాలకు ఎస్పీ జగదీశ్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. నాపై ఇప్పుడు మూడు హత్యాయత్నం కేసుల్ని నమోదు చేశారు" అంటూ చేసిన ఆరోపణల పరంపర ఇప్పుడు సంచలనంగా మారింది.

ఈ సందర్భంగా ఒక కొత్త పాయింట్ ను తెర మీదకు తీసుకొచ్చారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఎన్నికల సమయంలో సిట్ విచారణ చేసిన ఘటనలపై మళ్లీ ఇప్పుడు ఎందుకు కేసులు నమోదు చేశారు? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. జేసీ ఆదేశాలతోనే తనను తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నారు.

తనకు.. తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందన్న పెద్దారెడ్డి.. ఈ మధ్యన ఎస్పీ అనుమతితో తాడిపత్రి వెళ్లినా.. తన ఇంటిపై దాడి జరిగిందన్న విషయాన్ని గుర్తు చేవారు. అక్రమ కేసుల్లో తనను.. తన కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్నట్లుగా ఆరోపించారు. కేతిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. దీనిపై కూటమి ప్రభుత్వం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.