తెలంగాణ వరదలపై స్పందించిన ఉద్యోగులు.. ఎంత పెద్ద సాయమంటే?
జరిగిన నష్టాన్ని పూడ్చలేనిదే అయినప్పటికీ తాము చేసే సాయం అంతో ఇంతో ఉపయోగపడుతుందని సాయం అందిస్తున్నారు.
By: Tupaki Desk | 3 Sep 2024 8:06 AM GMTతెలంగాణ కుండపోత వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్న చందంగా తెరపి లేని వానలు పడ్డాయి. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పంటలు, రోడ్లు, ఇండ్లు దెబ్బతిన్నాయి. పదుల సంఖ్యలో చనిపోయారు. సుమారు 5వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యపేట, నల్లగొండ జిల్లాల్లో ఈ నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. పలుచోట్ల నిరాశ్రయులు ఆకలితో అలమటిస్తున్నారు.
వరద బాధితులను ఆదుకునేందుకు ఒక్కొక్కరుగా దయాహృదయులు ముందుకు వస్తున్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చలేనిదే అయినప్పటికీ తాము చేసే సాయం అంతో ఇంతో ఉపయోగపడుతుందని సాయం అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు.
అందులో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు భారీ విరాళం ప్రకటించి గొప్ప మనసును చాటారు. ఒకరోజు బేసిక్ పేని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఉద్యోగుల జేఏసీ తెలిపింది.
ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఒకరోజు బేసిక్ పేను సెప్టెంబర్ నెల జీతం నుంచి ఖజానాకు జమచేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఉద్యోగ జేఏసీ ప్రకటించిన ఈ మొత్తం రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఉద్యోగుల నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆపద సమయంలో అండగా నిలవడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.