Begin typing your search above and press return to search.

తిరుమల దర్శనం.. ఏపీ సీఎంకు మళ్లీ తెలంగాణ మంత్రి మొర

అప్పట్లో ఏపీ సీఎం స్పందనతో సమస్య తీరిందని భావించినా.. మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   12 March 2025 10:00 PM IST
తిరుమల దర్శనం.. ఏపీ సీఎంకు మళ్లీ తెలంగాణ మంత్రి మొర
X

కలియుగ వైకుంఠం తిరుమలను దర్శించుకోవాలని ఎవరికి ఉండదు..? తెలుగువారి పెన్నిది వెంకన్నస్వామిని కళ్లారా చూడాలని ఎందరికి ఉండదు.. ? తిరుమల అంటేనే పులకించే భక్త జనం కోకొల్లలు. అందుకే తిరుపతి వెళ్తున్నారంటేనే వారిని ప్రజలు చాలా మర్యాదగా చూస్తుంటారు.

తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం అంటే జీవితం ధన్యం అయినట్లేనని భావిస్తుంటారు.. దర్శనానికి ఎంత సమయం పట్టింది? అని అడుగుతుంటారు. కాగా, ఏపీలో గత ఏడాది జూన్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల దర్శనాల్లో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల కు అవకాశం కల్పించింది. కానీ, ఈ నిర్ణయం అమలులో మాత్రం ఫిర్యాదులు వస్తున్నాయి. మూడు నెలల కిందటి వరకు కూడా ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు.

అప్పట్లో ఏపీ సీఎం స్పందనతో సమస్య తీరిందని భావించినా.. మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను మన్నించే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. తమ నేతల లేఖలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పరిస్థితి సరిదిద్దాలని అభ్యర్ధించారు

తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై టీటీడీ అధికారులు తెలంగాణ భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డం లేదని, దీంతో తీవ్ర గందర గోళం నెల‌కొంటోందని ఏపీ సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. టీటీడీ అధికారులు మీ ఆదేశాలను సరిగ్గా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖల వ్యవస్థను తిరిగి తెచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. అయితే, నిర్ణయం సరిగ్గా అమలు అయ్యేలా చూడాలని కోరారు. తెలంగాణ నుంచి తిరుమలను సందర్శించే భక్తుల సంఖ్య ఈ మ‌ధ్య బాగా పెరిగిందని మంత్రి వివరించారు.

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత కూడా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్న తెలంగాణ భక్తుల సంఖ్య తగ్గలేదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇస్తున్న లేఖలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెంటనే ప్ర‌త్యేకంగా పరిశీలించి, గతంలో మీరు ఇచ్చిన ఆదేశాలు సక్రమంగా అమలయ్యేలా టీటీడీ అధికారులకు స్పష్టమైన సూచన ఇవ్వాలని కొండా సురేఖ ప్ర‌త్యేకంగా విజ్ఞ‌ప్తి చేశారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖ ఆధారంగా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం టీటీడీకి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. పెరుగుతున్న బ్రేక్ దర్శనాల ఒత్తిడితో సాధారణ భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దీంతో.. అందరి లేఖల సిఫార్సులు పూర్తి స్థాయిలో అమలవడం లేదు. దీంతో, తెలంగాణ ప్రజా ప్రతినిధుల ఆందోళనతో తాజాగా కొండా సురేఖ నేరుగా ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.