ఆమ్మో వాళ్ళు మాకు వద్దు అంతే !
ఆదిలాబాద్ లో సోయం బాపూరావుకు, నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్ కు టికెట్లు ఇవ్వద్దని పార్టీలోని నేతలు గట్టిగా కోరుతున్నట్లు సమాచారం.
By: Tupaki Desk | 10 Feb 2024 11:30 AM GMTరాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలోని నాలుగు ఎంపీ స్ధానాల్లో సిట్టింగ్ ఎంపీలకే టికెట్లని గతంలో ఎప్పుడో జాతీయ నాయకత్వం ప్రకటించింది. మిగిలిన స్ధానాల్లో పోటీకే దరఖాస్తులు తీసుకోవాలని కూడా అనుకున్నది. అయితే జాతీయ నాయకత్వం ఆదేశాలకు భిన్నంగా దరఖాస్తులు అందాయి. దాంతో కేంద్ర నాయకత్వం విస్తుపోయింది. విషయం ఏమిటంటే తెలంగాణాలో 17 పార్లమెంటు సీట్లున్నాయి. ఇందులో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్ధానాల్లో సిట్టింగ్ ఎంపీలున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న నేతలు దరఖాస్తులు చేసుకోవచ్చని జాతీయ నాయకత్వం చెప్పింది. నాయకత్వం ఏమనుకున్నదంటే సిట్టింగు స్ధానాలు పోను మిగిలిన 13 నియోజకవర్గాలకే దరఖాస్తులు వస్తాయని. అయితే ఊహించని రీతిలో ఆదిలాబాద్, నిజామాబాద్ స్ధానాల్లో పోటీకి బయటనుండే కాకుండా పార్టీ నేతలు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను చూసి జాతీయ నాయకత్వం ఆశ్చర్యపోయిందట. ఆదిలాబాద్ లో సోయం బాపూరావుకు, నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్ కు టికెట్లు ఇవ్వద్దని పార్టీలోని నేతలు గట్టిగా కోరుతున్నట్లు సమాచారం.
కారణం ఏమిటంటే బాపూరావు, అర్ధింద్ వ్యవహారశైలితో పార్టీలోని చాలామంది నేతలు వ్యతిరేకంగా తయారయ్యారట. తన మద్దతుదారులను తప్ప పార్టీలోని అందరు నేతలను కలుపుకుని వెళ్ళటంలేదట. అవసరార్ధం ఎవరైనా వీళ్ళ దగ్గరకు వచ్చినా తమ వ్యతిరేక వర్గం అన్న ముద్రవేసి దూరంగానే ఉంచుతున్నట్లు పార్టీలో టాక్ పెరిగిపోతోంది. ఈ కారణంతోనే ఈమధ్య జగిత్యాల బీజేపీ నేతలు పార్టీ ఆఫీసులో పెద్ద గొడవే చేశారు. ఒక కార్యకర్తయితే అర్వింద్ కు టికెట్ ఇస్తే ఒంటిపై పెట్రోలో పోసుకుంటానని బెదిరించటమే కాకుండా పెట్రోలో పోసుకోవటం కలకలం రేపింది.
తమను కాదని మళ్ళీ బాపూరావు, అర్వింద్ కే టికెట్లిస్తే కచ్చితంగా ఓడగొడతామని కూడా నేతలు హెచ్చరిస్తున్నారు. దాంతో ఏమిచేయాలో అర్ధంకాక జాతీయ నాయకత్వం తలపట్టుకున్నది. ఈ విషయం కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. నేతల అభీష్టానుసారం కొత్తవారిని ఎంపికచేయాలా లేకపోతే సిట్టింగులకు సిఫారసుచేయాలా అన్నది అర్ధంకావటంలేదు. సికింద్రాబాద్, బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ స్ధానాల విషయంలో పార్టీకి పెద్ద సమస్యలు లేవు. మరి చివరకు అధిష్టానం ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.