హోం మినిస్టర్ సీతక్క.. రాజగోపాల్, దానంలకూ పదవి.. నేడో, రేపో?
తెలంగాణలో శుక్రవారం క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 2 July 2024 10:26 AM GMTతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటిపోయింది. అటు పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా రేవంత్ రెడ్డి రెండు బాధ్యతలను నిర్వరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి, లోక్ సభ ఎన్నికల్లోనూ 8 సీట్లు సాధించిన రేవంత్.. ఇక పూర్తిగా పాలన మీద ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చింది. దీంతోపాటు టీపీసీసీ చీఫ్ గా ఆయన పదవీ కాలం జూలై 7వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా కొత్త టీపీసీసీ చీఫ్ ను నియమించే పనిలో పడింది కాంగ్రెస్ అధిష్ఠానం. మరి పాలనపై సీఎం పూర్తిగా ఫోకస్ పెట్టేందుకు పూర్తి స్థాయి మంత్రివర్గమూ అవసరం. అందుకే విస్తరణకు కూడా ఓకే చెప్పింది.
5న ప్రమాణం..?
తెలంగాణలో శుక్రవారం క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఆషాఢం రాకముందే విస్తరణ చేపట్టాలని సీఎం భావిస్తున్నారు. మరో ఆరుగురిని మంత్రులుగా తీసుకునే చాన్స్ ఉంది. ఇప్పుడున్న వారో కొందరి శాఖలను మార్చనున్నట్టు సమాచారం. హోం మంత్రిగా సీతక్క పేరు బాగా వినిపిస్తోంది. అయితే, రాజధాని హైదరాబాద్ కు ఒక్క మంత్రి కూడా లేరు. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ ను మంత్రిని చేస్తారని మొదట అనుకున్నారు. కానీ, కాంగ్రెస్ బీ ఫామ్ పై గెలిచినవారికే మంత్రి పదవులని రేవంత్ ప్రకటించారు. దీంతో కొంత సందిగ్ధం నెలకొంది.
ఈయనకు మాత్రం పక్కా..
ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి రేవంత్, మంత్రిగా జూపల్లి ఉన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే, ముదిరాజ్ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కుతుందని ఇప్పటికే రేవంత్ చెప్పారు. మహేశ్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ పదవి రాకపోతే కేబినెట్ లో చోటు అడుగుతున్నారు.
రెడ్డి కోటాలో బలమైన పోరు..
ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి మంత్రులు లేరు. కాగా, రెడ్డి కోటా నుంచి చాలామంది పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికీ పదవి ఖాయం అంటున్నారు. వరంగల్ నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి కూడా పోటీలో ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లా, వెలమ వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు పదవి ఆశిస్తున్నారు. గడ్డం వివేక్, వినోద్ హైకమాండ్ పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారు. లంబాడీలకు ప్రాధాన్యం ఇవ్వలేదంటూ.. దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ పదవి కావాలంటున్నారు. నల్లగొండ జిల్లాలో ఎక్కువమంది మంత్రులు ఉండడంతో బాలూనాయక్ కు డిప్యూటీ స్పీకర్ ఇస్తారని చెబుతున్నారు.