రేవంత్.. భట్టికి ముందే కండీషన్ పెట్టేసిన కాంగ్రెస్?
తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తుందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఎవరిని డిసైడ్ చేస్తుందన్న దానిపై చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 29 Nov 2023 5:30 PM GMTతెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తుందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఎవరిని డిసైడ్ చేస్తుందన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ వాదనలో అర్థం లేదని.. అన్ని తానై నడిపించిన రేవంత్ రెడ్డిని కాకుండా ఇంకెవరికో కట్టబెట్టే అవకాశం లేదన్న మాట వినిపించినా.. అదేమీ నిజం కాదన్న అభిప్రాయం కాంగ్రెస్ ముఖ్యులు అనధికార సంభాషణల్లో తెలియజేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు? అన్న దానిపై అనవసర లొల్లికి అవకాశం లేకుండా చేయటానికి వీలుగా అధినాయకత్వం ఒక స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
పార్టీ కనుక బొటాబొటి మెజార్టీ సాధించి.. కుంటుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలుంటే మాత్రం రేవంత్ కు అవకాశం ఇవ్వరంటున్నారు. దీనికి కారణం.. రేవంత్ ను సీఎంగా అంగీకరించే వారికి తగ్గట్లే.. నో అంటే నో అనే గొంతులు బలంగా పని చేస్తాయని.. అందుకే భట్టికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫార్ములాలో రేవంత్ కు ససేమిరా అనే వర్గాన్ని సంతోషపర్చటంతో పాటు.. మిగిలిన వారిని కూడా ఒక జట్టుగా చేసే వీలుంటుందని చెబుతున్నారు.
ఒకవేళ స్పష్టమైన అధిక్యత వచ్చిన పక్షంలో రేవంత్ ను సీఎంగా నిర్ణయిస్తారని చెబుతున్నారు. డెబ్భై..అంతకు మించి సీట్లు వచ్చిన పక్షంలో రేవంత్ ముఖ్యమంత్రి ఖాయమని.. ఆయన్ను కాదనే వారు సైతం మాట్లాడటానికి ఏమీ ఉండదంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఇప్పటికే రేవంత్.. భట్టికి కాంగ్రెస్ అధినాయకత్వం సంకేతాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.