ఛలో తెలంగాణ: నేటి నుంచి రాష్ట్రంలో డబుల్ ఇంపేక్ట్!
తెలంగాణలో మరో ఐదు రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో ఈ ఐదు రోజులూ రోజుకి 24గంటల కంటే ఎక్కువ సమయం ఉంటే బాగుండు అని పలువురు నేతలు భావిస్తున్నారంట.
By: Tupaki Desk | 24 Nov 2023 4:09 AM GMTతెలంగాణలో మరో ఐదు రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో ఈ ఐదు రోజులూ రోజుకి 24గంటల కంటే ఎక్కువ సమయం ఉంటే బాగుండు అని పలువురు నేతలు భావిస్తున్నారంట. దీంతో తిండీ తిప్పలు మానేసి మరీ పగలూ రాత్రీ తేడా లేకుండా జనాల్లో తిరుగుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో రాజస్థాన్ లో నిన్నటితో ప్రచారానికి తెర పడింది. దీంతో... జాతీయస్థాయి నేతలంతా తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలేమీ లేకుండా... అంతా ఛలో తెలంగాణ అంటున్నారు!
అవును... రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వానికి గురువారం సాయంత్రంతో తెరపడింది. దీంతో శనివారం ఆ రాష్ట్రంలోని 200 స్థానాలకు గానూ 199 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ మృతి చెందడంతో 199 స్థానాలకే నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో... శ్రీ కరణ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ఇలా రాజస్థాన్ లో ప్రచారానికి తెరపడటంతో.. నేటి నుంచి జాతీయ నేతలంతా తెలంగాణకు క్యూ కట్టనున్నారు. నాలుగైదు రోజుల పాటు కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలంతా రాష్ట్రంలోనే మకాం వేయనున్నారు. దీంతో ఇకపై తెలంగాణ ఎన్నికల ప్రచారంలో డబుల్ ఇంపాక్ట్ కనపడనుందని అంటున్నారు పరిశీలకులు. కాగా... తెలంగాణలో ఈ నెల 28న ప్రచారపర్వం ముగియనున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే రాష్ట్రంలో పలు దఫాలుగా ప్రచారంలో పాల్గొన్న జాతీయ స్థాయి అగ్రనేతలు.. మరోసారి ప్రచారంలో పాల్గొని ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్రానికి రానున్న ప్రియాంక గాంధీ మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం పాలకుర్తి, తర్వాత హుస్నాబాద్, సాయంత్రం కొత్తగూడెం సభల్లో పాల్గొంటారు. అనంతరం ఇవాళ రాత్రికి కొత్తగూడెంలో బస చేయనున్న ప్రియాంక.. రేపు పాలేరు, సత్తుపల్లి, మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఇదే క్రమంలో... రేపు రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ... బోధన్, ఆదిలాబాద్, వేములవాడ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభలకు హాజరవుతారు.
ఇదే సమయంలో ఇప్పటికే తెలంగాణలో పలు సభలు నిర్వహించిన బీజేపీ అగ్రనేతలు మరోసారి మొదలుపెట్టబోతున్నారు. ఇందులో భాగంగా... బీజేపీ తరఫున ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్రానికి రానున్న అమిత్ షా.. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఈ క్రమంలో... మధ్యాహ్నం ఆర్మూర్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
తర్వాత హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, అంబర్ పేట్ రోడ్ షోల్లో పాల్గొంటారు. ఇక మరో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ మేడ్చల్, కార్వాన్, కంటోన్మెంట్ నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. ఇక రేపు రాష్ట్రానికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. హుజూర్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.
ఇదే సమయంలో రేపు ప్రధాని మోడీ కూడా రాష్ట్రానికి రానున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా 25, 26, 27 తేదీల్లో వరుసగా ప్రచారంలో పాల్గొనబోతున్న మోడీ... చివరి రోజు హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నారు.