ఈ కోట్లు ఎవరివి? ఆధారాలు చిక్కక అధికారులు సతమతం!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. పోలీసులు, ఐటీ అధికారులు చేస్తున్న ఆకస్మిక తనిఖీల్లో కోట్లకు కోట్ల సొమ్ము పట్టుబడుతోంది.
By: Tupaki Desk | 16 Nov 2023 9:43 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. పోలీసులు, ఐటీ అధికారులు చేస్తున్న ఆకస్మిక తనిఖీల్లో కోట్లకు కోట్ల సొమ్ము పట్టుబడుతోంది. నాలుగు రోడ్ల కూడలి నుంచి కీలక జంక్షన్ల వరకు ఎక్కడ కాపు కాసినా.. కోట్ల కొద్దీ సొమ్ము చిక్కుతోంది. నామినేషన్ల దాఖలుకు ముందు నుంచి ఇప్పటి వరకు ఇలా దొరికిన మొత్తం సుమారు 741 కోట్ల వరకు ఉందని అధికారులు తెలిపారు. అయితే.. ఈ సొమ్ము ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు పంపించారనే విషయాలపై మాత్రం వారికి సమాచారం చిక్కడం లేదు.
ఆధారాలు చూపిస్తున్నా.. ఏవేవో కంపెనీల పేర్లు, సంస్థల పేర్లు ఉంటున్నాయే తప్ప.. ఎవరి పేర్లూ దొరక డం లేదు. కానీ, ఇంత మొత్తంలో ఆయా కంపెనీలు ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఎందుకు రవాణా చేస్తున్నారనే కోణంలో విచారణలు సాగుతున్నాయి. కానీ, ఎక్కడా దీనికి సంబంధించి పక్కా ఆధారా లను మాత్రం అధికారులు సేకరించలేక పోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇక, క్షేత్రస్థాయిలో డబ్బులు పంపకాలు గుట్టుగా సాగుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. కానీ, ఇక్కడ కూడా.. కీలక వ్యక్తులు వారికి కనిపించడం లేదు. గత బుధవారం నాటికి 541 కోట్లను సీజ్ చేయగా.. కేవలం నాలుగు రోజుల్లోనే మరో 200 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. పట్టుబడిన వాహనాలను స్టేషన్లను తరలించినా.. ఆ వెంటనే రిలీజ్ చేసుకుంటున్నారు. దీంతో అధికారులు ఆధారాలు చిక్కక.. ఎన్నికల సంఘానికి సమాధానం చెప్పలేక సతమతం అవుతుండడం గమనార్హం.