Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. ఆసక్తికర విషయాలు!

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్, మిజోరంలలో పోలింగ్ పూర్తైంది.

By:  Tupaki Desk   |   30 Nov 2023 10:39 AM GMT
ఎగ్జిట్  పోల్  ఫలితాలు..  ఆసక్తికర విషయాలు!
X

ఎన్నికల సీజన్ వచ్చిందంటే అందరి దృష్టీ సర్వేలపై ఉంటుందంటే అతిశయోక్తి కాదు! సర్వే ఫలితాలు ఏమి చెబుతున్నాయి.. ఎవరివైపు అనుకూలంగా ఉన్నాయి.. మొదలైన విషయాలపై విపరీతమైన చర్చ జరుగుతుంటుంది. ఇక పోలింగ్ ముగిసిందంటే వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాల సందడి మొదలవుతుంటుంది. ఈ క్రమంలో అసలు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎవరు, ఎలా నిర్వహిస్తారనేది ఇప్పుడు చూద్దాం!

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్, మిజోరంలలో పోలింగ్ పూర్తైంది. ప్రస్తుతం తెలంగాణలో పోలింగ్ జరుగుతుంది. ఈ సమయంలో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌ వైపు మళ్లుతుంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూల ఫలితాలు రాబోతున్నాయి.. ఓటరు నాడి ఎటువైపు ఉందనే చర్చ మొదలవుతుంది.

ఎగ్జిట్ పోల్స్ అనేది ఎన్నికలలో ఓట్లు ఎలా పడ్డాయనే దాని గురించి ఇచ్చే సమాచారం. దీన్ని పలు వార్తా సంస్థలు, ఇతర ఏజెన్సీలు నిర్వహిస్తుంటాయి. ఇవి ఓటింగ్ సరళి గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తాయి. ఫలితంగా విజేతలను అంచనా వేయడంలో సహాయపడతాయి. అలా అని ఎగ్జిట్ పోల్ ఫలితాలు పూర్తిగా నమ్మదగినవి అని అనుకుంటే పొరపాటే! ఇవి ఒక అంచనా మాత్రమే!!

ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేవి పోలింగ్ రోజున ఓటరు మనోగతం తెలుసుకుంటూ జరిపే సర్వే! ఇందులో భాగంగా ఎంపిక చేసుకున్న కొన్ని పోలింగ్ కేంద్రల వద్ద ఓట్ల నాడీని తెలుసుకుని ఒక అంచనాకు వస్తారు.

సాధారణంగా ప్రీపోల్ సర్వేలో... ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, యువత, వికలాంగులు, మహిళలు, వృద్ధులు, కులం, మతం, పేదలు, మధ్యతరగతి ఇలా వివిధ వర్గాల వారీగా ఓటర్లను ఎంచుకొని సర్వే చేస్తారు. అయితే... ఎగ్జిట్‌ పోల్‌ లో మాత్రం అలా కాదు. పోలింగ్ రోజే, ఓటు వేసేందుకు వచ్చే వారిని మాత్రమే ప్రశ్నించి సమాచారం సేకరిస్తారు.

దీంతో... ప్రీపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు ఖచ్చితత్వానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతారు! ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఫైనల్ గా వచ్చే ఫలితాలకు దాదాపు దగ్గరగా ఉంటాయని అంటారు.

ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణ ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్ర సాయంత్రం 6:30 గంటలకు తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో తెలంగాణ కంటే ముందుగా ఎన్నికలు పూర్తిచేసుకున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా విడుదలకాబోతున్నాయి!