హంగ్ వస్తే.. బీఆర్ ఎస్-బీజేపీ జట్టు: కామ్రెడ్ ఉవాచ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతున్నా.. ప్రజల నాడి మాత్రం నాయకులకు చిక్కడం లేదు.
By: Tupaki Desk | 25 Nov 2023 2:30 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతున్నా.. ప్రజల నాడి మాత్రం నాయకులకు చిక్కడం లేదు. దీనికితోడు అందుతున్న సర్వేలు కూడా ఏపార్టీకి పూర్తిస్థాయిలో మెజారిటీ కట్టబెట్టడం లేదు. దీంతో హంగ్ వచ్చే అవకాశం లేకపోలేదని.. కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదే విషయాన్ని సీపీఎం జాతీయ కార్యదర్శి.. సీతారాం ఏచూరి కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో హంగ్ వస్తే.. బీఆర్ ఎస్ పార్టీ బీజేపీతో కలిసేందుకు రెడీగా ఉందని ఆయన అన్నారు.
అదేసమయంలో రాష్ట్రంలో హంగ్ వస్తే.. సీపీఎం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతుందని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ.. బీజేపీ చేతిలో బందీ అయ్యాయని ఆయన ఆరోపించారు. దేశంలో బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోంది.
తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో ఉన్నా కాంగ్రెస్ కు నష్టం లేదని తెలిపారు. బీజేపీ వ్యతిరేకతతో అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నారని విమర్శంచారు. `ఇండియా` కూటమిలో ఇప్పటికీ సీపీఎం ఉందన్నారు. సీపీఎం ఖమ్మం జిల్లాలో పోటీ చేయకుండా పొత్తులు అనేది అసంభవమని సీతారం ఏచూరి తేల్చి చెప్పారు.
``పోరాటాలకు ఎర్ర జెండా కావాలి.. ఎన్నికలు వచ్చే సరికి ఇంకో పార్టీ కావాలి.. ఇలా ఎందుకు జరుగుతోందని జనాలను మేం అడుగుతున్నాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే బెంగాల్, త్రిపురలో కమ్యూనిస్టులే మళ్ళీ అధికారంలోకి వస్తారు`` అని ఏచూరి వ్యాఖ్యానించారు.