Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నికల్లో కూలీలు

ఈ నేపథ్యంలో కూలీలకు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. అభ్యర్థులు తమ రోజువారీ ప్రచారాల్లో భారీ ఎత్తున జనం కనిపించేలా జాగ్త్రతలు తీసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Nov 2023 6:06 AM GMT
తెలంగాణ ఎన్నికల్లో కూలీలు
X

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్‌ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల స్వీకరణ ఘట్టం కూడా ముగిసిపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసే ఆయా పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జనాల్లోనే ఉంటూ ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులు... కార్యకర్తలు, తమ అనుచరులతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇక ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ముఖ్య నేతలతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కూలీలకు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. అభ్యర్థులు తమ రోజువారీ ప్రచారాల్లో భారీ ఎత్తున జనం కనిపించేలా జాగ్త్రతలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కూలీలను తీసుకొస్తున్నారు. ఇందుకోసం కూలీలు ఒక్కొక్కరికి రోజుకు రూ.500, భోజనం, మినరల్‌ వాటర్, మజ్జిగ, మద్యం ఇలా ఏది కావాలంటే అది అందిస్తున్నారు. కూలితో వచ్చే డబ్బుల కంటే ఇలా ఎన్నికల ప్రచారానికి కూలీలుగా వెళ్తే బాగా గిడుతుండటంతో వారు సైతం ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

తమను తీసుకెళ్లిన అభ్యర్థుల తరఫున, ఆయా పార్టీల తరఫున నినాదాలు చేయడం, జెండాలు మోయడం, కరపత్రాలు పంచడం వంటి పనులను కూలీలు చేస్తున్నారు. ప్రచారానికి కూలీల అవసరం బాగా ఉండటంతో ఆయా పార్టీలు వారికి పోటీలు పడి డబ్బు చెల్లిస్తున్నాయి.

ఇలా గ్రామాల్లో వాడవాడలా తిరగడానికి ప్రతి పార్టీ తరఫున రోజుకు కనీసం 50 మందికి తగ్గకుండా కూలీలు ఉంటున్నారు. కూలీలకైతే రోజుకు రూ.500, భోజనం, మినరల్‌ వాటర్, మజ్జిగ, మద్యం ఇలా ఆయా పార్టీలు అందిస్తున్నాయి. ఇక ముందుండి నినాదాలిస్తూ ప్రచారాన్ని సమన్వయం చేసే యువకులకైతే రోజుకు రూ.1000 దాకా ముట్టజెబుతున్నారు.

మరోవైపు కూలీలను ఆయా పార్టీలు తమ ప్రచారానికి తీసుకుపోతుండటంతో వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో కూలీల కొరత ఏర్పడింది. దీంతో ఆయా రంగాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ పల్లెల్లో వరి కోతలు మొదలయ్యాయి. దీంతో పెద్ద ఎత్తున్న కూలీల అవసరం పడుతోంది. కొన్ని చోట్ల వరి కోత యంత్రాలు ఉన్నప్పటికీ ధాన్యం తరలించడానికి, బస్తాల్లో నింపడానికి, కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడానికి భారీగా కూలీల అవసరం ఏర్పడుతోంది. కేవలం వరికోతలకే కాకుండా ఇతర పంటల కోతలు, మార్కెట్లకు ఆయా వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు పనులకూ కూలీలు దొరకడం లేదు. కూలీలంతా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఏవైనా పనులు ఉంటే వారిని బతిమలాడాల్సిన పరిస్థితులు రైతులకు ఏర్పడుతున్నాయి.

చాలా గ్రామాల్లో కూలీలు ఎన్నికల ప్రచారానికి గుత్తకు రేటు మాట్లాడుకుంటున్నారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో మొత్తం 8 మంది సభ్యులున్నారు. వారికి సొంత వాహనమూ ఉంది. దీంతో ఏ పార్టీ మీటింగ్‌ జరిగినా.. వారంతా రావడానికి స్థానిక నేతలతో రూ.10 వేలకు బేరం మాట్లాడుకుంటున్నారు. వారి బండిలోనే సమావేశానికి వచ్చి దానిలోనే తిరిగి వెళుతున్నారు. ఇలా రోజుకు రూ,.10 వేలు సంపాదించుకుంటున్నారు.

ఇక ప్రధాన నేతలు వచ్చినప్పుడు.. పెద్ద గ్రామాల్లో మీటింగులు, పట్టణాల్లో బహిరంగ సభలు పెడుతున్నారు. వీటికి కార్లు, బస్సులు, లారీలు, డీసీఎంలలో జనాలను పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. దీంతో కూలీలకు బాగా గిట్టుబాటు అవుతోంది.